
నేషనల్ హెరాల్డ్ కేసుపై పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన
నేషనల్ హెరాల్డ్ కేసును వ్యతిరేకిస్తూ బుధవారం పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసనకు దిగారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు పెద్ద సంఖ్యలో పాల్గొని, “సత్యమేవ జయతే- నిజమే గెలుస్తుంది” అనే నినాదాలతో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
కర్ణాటకలో కూడా కాంగ్రెస్ నిరసనలు
ఇదే అంశంపై కర్ణాటకలో కూడా కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బెలగావిలోని సువర్ణ సౌధ వద్ద ఉన్న గాంధీ విగ్రహం దగ్గర కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ పత్రిక భారత స్వాతంత్ర్య ఉద్యమంతో ముడిపడి ఉందని చెప్పారు. ఈ పత్రికను స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారని గుర్తు చేశారు. “నేషనల్ హెరాల్డ్ దేశ గర్వకారణం. దీన్ని టార్గెట్ చేయడం సరైంది కాదు. బీజేపీ ప్రతీకార రాజకీయాలు ఆపాలి” అని డీకే శివకుమార్ అన్నారు. అలాగే, ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని కూడా కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు.
మల్లికార్జున ఖర్గే ఆరోపణలు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నేషనల్ హెరాల్డ్ కేసుపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రతీకారంతోనే కొనసాగుతోందని ఆయన అన్నారు. “ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు. ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు కాలేదు. గాంధీ కుటుంబాన్ని వేధించేందుకే ఈ వ్యవహారం కొనసాగుతోంది. మా నినాదం ‘సత్యమేవ జయతే’” అని ఖర్గే స్పష్టం చేశారు.
మంగళవారం ఢిల్లీ కోర్టు ఈ కేసులో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు స్వీకరించలేదు. మూల నేరానికి (ప్రెడికేట్ ఆఫెన్స్) సంబంధించిన ఎఫ్‌ఐఆర్ లేకుండా పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నడపడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో నేషనల్ హెరాల్డ్ కేసు దేశ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్షం దీన్ని రాజకీయ వేధింపులుగా అభివర్ణిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం మాత్రం చట్ట ప్రకారం చర్యలని చెబుతోంది.
అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏమిటి?
నేషనల్ హెరాల్డ్ అనేది 1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన పత్రిక. దాని ఆస్తుల బదిలీలో, నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఫిర్యాదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు వాటా ఉన్న 'యంగ్ ఇండియన్' సంస్థ ద్వారా అక్రమంగా ఆస్తులను దక్కించుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది. అయితే తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నేతలకు తాత్కాలికంగా పెద్ద ఊరట లభించినట్లయింది.
