
నేరాన్ని బాధితురాలిపై నెట్టడమే మమత మార్క్ పరిష్కారమా?
ఆడది అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా తిరగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్మాగాంధీ అన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరించే వీలు లేదు. అర్ధరాత్రి కాదు కదా అసలు పగలూ,రాత్రి అనే తేడా లేకుండా ఏ సమయంలోనూ మహిళలకు భద్రత ఉండడం లేదు. విచిత్రమైన విషయం ఏంటంటే మహిళలకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలే స్త్రీలు ఎప్పుడు బయటకు వెళ్లాలో, వెళ్లకూడదో నిర్ణయిస్తున్నాయి. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే అలాంటి మాటలు మాట్లాడుతోంది ఓ మహిళా ముఖ్యమంత్రి కావడం.
రాష్ట్రంలో అత్యాచారాల ఘటనలతో అప్రతిష్టపాలవుతున్న పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ మహిళలను ఉద్దేశించి అనౌచిత వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్‌లో ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థినిపై మూడురోజుల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది. ఆ విద్యార్థిని ఓ ప్రయివేట్ మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఆమె స్వస్థలం ఒడిశా.
విద్యార్థిని తన పరిచయమున్న వ్యక్తితో కలిసి ఈ నెల 10న రాత్రి 8 గంటల ప్రాంతంలో ఏదైనా తినడానికి కళాశాల క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిందని, అక్కడ కొంతమంది యువకులు ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి, ఆమె మొబైల్ ఫోన్, డబ్బు లాక్కున్నారని పోలీసులు చెప్పారు. తర్వాత ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని బెదిరించి అక్కడి నుండి పంపించివేశారని, సమీపంలోని అడవిలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఏడాది జూలైలో కోల్‌కతాలోని ఓ లా కళాశాలలో విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. గత ఏడాది ఆగస్టులో ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో ఓ ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల సంఖ్య ఇలా పెరగడానికి శాంతిభద్రతల నిర్వహణాలోపమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అత్యాచార ఘటన తర్వాత దుర్గాపూర్ అత్యాచారం కేసు సంచలనం సృష్టిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలతో పాటు మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. దీంతో ఒత్తిడి పెరిగి అన్నారో, కావాలని వ్యాఖ్యానించారో తెలియదు కానీ బాధితురాలిని ఉద్దేశించి మమతా బెనర్జీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం జరిగింది అర్ధరాత్రి పన్నెండున్నరగంటల సమయంలోనని, ఆ సమయంలో అసలు కాలేజీ క్యాంపస్ వదిలి బయటకు ఎందుకు వెళ్లారని మమత ప్రశ్నించారు. యువతుల భద్రతకు కాలేజీ యాజమాన్యాలే బాధ్యత వహించాలని వివాదాస్పదంగా మాట్లాడారు. మహిళలు ఆ సమయంలో బయటకు రాకూడదని, భద్రత లేదని మమత వ్యాఖ్యానించారు. భద్రత లేని పరిస్థితులను ఎవరు సృష్టించారో మమత చెప్పలేదు. అసలు అత్యాచారం ఏ సమయంలో జరిగినా మమతాబెనర్జీ అలా మాట్లాడకూడదు. కానీ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం అత్యాచారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో జరిగింది. రాత్రి 8 గంటలప్పుడు అమ్మాయిలు బయటకు వెళ్లడం సాధారణమైన విషయం. ఈ సమయం కూడా అసాధారణం అనుకుంటే మహిళలకు అసలు ప్రాంతం, సమయంతో సంబంధం లేకుండా ఎక్కడా రక్షణ లేదు.
ప్రతి వ్యక్తికి రక్షణ కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత . ఉద్యోగం కోసమో, చదువు కోసమో రాత్రి వేళ్లల్లో మహిళలు తప్పనిసరిగా ఒంటరిగా ప్రయాణించాల్సిన పరిస్థితులు దేశంలో ఉన్నాయి. ఆ సమయంలో వారికి ఎలాంటి ఇబ్బందీలేకుండా సురక్షితంగా ఇంటికి చేరేలా ప్రభుత్వాలు భద్రతాచర్యలు తీసుకోవాలి. పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షించాలి. రాత్రి 8గంటల సమయమంటే నగరాలు, పట్టణాలు, పల్లెలు మొదలుకుని అన్నిచోట్లా జనసంచారం ఉండే సమయం. అలాంటి సమయంలోనే యువతిపై అత్యాచారం జరిగింది. బాధితురాలు పక్కన ఓ వ్యక్తి ఉన్నా, ఆయన్ను అక్కడినుంచి పంపించి యువతిని అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపారంటే పశ్చిమబెంగాల్‌లో శాంతిభద్రతల స్థాయి ఏంటో తెలుసుకోవచ్చు.
దుర్గాపూర్ అత్యాచారం కేసు వందకు వందాశాతం భద్రతాలోపమే. ఆ లోపాన్ని అంగీకరించకుండా నెపాన్ని బాధితురాలిపై నెట్టివేయడం మహిళా సీఎం మమతాబెనర్జీకి తగిన విషయం కాదు.. కాలేజీ యాజమాన్యాలు అర్ధరాత్రి అమ్మాయిలను బయటకు పంపకూడదని కూడా మమత వ్యాఖ్యానించారు. బెంగాల్ లాంటి ప్రగతిశీల రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది.
మమతాబెనర్జీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. అప్గానిస్తాన్‌లో వలే పశ్చిమబెంగాల్‌లో కూడా తాలిబాన్ల పాలన సాగుతోందని విమర్శించారు.
ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2023లో 29,670 అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఇక పోలీస్ స్టేషన్ మెట్లెక్కని కేసులెన్నో లెక్కలేదు. తెలియనివారితో పాటు తెలిసినవారు, బంధువులు, సొంత కుటుంబ సభ్యుల నుంచే మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. సామూహిక హత్యాచారం వంటి కేసులూ దేశంలో ఎక్కువగా నమోదవుతున్నయి. దిల్లీ తర్వాత మహిళలపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రం పశ్చిమబెంగాలే. దుర్గాపూర్ కేసులో యువతి అర్ధరాత్రి బయటకు వెళ్లడం వల్లే అత్యాచారం జరిగినట్టుగా మమతాబెనర్జీ వ్యాఖ్యలున్నాయి. మరి మిగిలిన కేసులు సంగతేంటి? ఓ మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు సరైన భద్రత లేకపోవడమేంటి? దీనికి మమతాబెనర్జీ సమాధానం చెప్పాలి. పటిష్ట భద్రతాచర్యలు, అవగాహనా కార్యక్రమాలు పెంచి మహిళలపై నేరాలకు అడ్డుకట్టవేయాలి. రాజారామమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి సంఘసంస్కర్తలకు నిలయమైన పశ్చిమబెంగాల్‌లో మహిళలకు రక్షణ లేకపోవడం, అందుకు బాధ్యత మహిళలదే అని మమతాబెనర్జీలాంటి ముఖ్యమంత్రి చెప్పడం నిజంగా క్షమించరాని విషయం
