
నేరడి బ్యారేజికి కేంద్ర గెజిట్.. విశాఖ జోన్‌లోకి 7 రైల్వే స్టేషన్ల విలీనం!
శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై తనకున్న అంకితభావాన్ని చాటుకుంటూ, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లాకు సంబంధించిన మూడు కీలక విజయాలను సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ఖాతాలో పోస్ట్ ద్వారా పంచుకున్నారు. జిల్లా ప్రజల దశాబ్దాల కలలు సాకారం కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నీలమణి దుర్గ ఆలయ గౌరవార్థం ఆర్.ఓ.బి మార్పు
సుమారు 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన పాతపట్నం శ్రీ నీలమణి దుర్గమ్మ ఆలయ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, జాతీయ రహదారి 326A వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్లాన్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. స్థానిక భక్తులు, ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఈ మార్పులు చేపట్టాలని చేసిన విన్నపానికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
ఈ మార్పుల కోసం జాతీయ రహదారుల సంస్థ అదనంగా రూ.15 కోట్లు మంజూరు చేయడం విశేషం. దీనివల్ల ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే మహా జాతర ఉత్సవాలకు ఎటువంటి ఆటంకం కలగదు. ఆంధ్ర-ఒరిస్సా రాష్ట్రాలను కలిపే ఈ కీలక ప్రాజెక్టులో మార్పులు చేసినందుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.
విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోకి శ్రీకాకుళం ఏడు కీలక స్టేషన్ల విలీనం
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు సంబంధించి మరో చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్‌లోని ఖుర్దా డివిజన్ పరిధిలో ఉన్న ఇచ్చాపురం నుండి పలాస వరకు గల 7 రైల్వే స్టేషన్లను ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లోకి బదిలీ చేస్తూ రైల్వే బోర్డు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
గతంలో జోన్ ప్రకటన వచ్చినప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలోని ఈ కీలక స్టేషన్లు పరాయి జోన్‌లో ఉండటంపై పార్లమెంట్ వేదికగా అనేక పోరాటాలు జరిగాయి. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను పలుమార్లు కలిసి విన్నవించిన ఫలితంగా నేడు ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనివల్ల శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాలు ప్రయాణికుల సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి అని ఎక్స్ వేదికగా తెలిపారు.
వంశధార నేరడి బ్యారేజి నిర్మాణం: తీరిన దశాబ్దాల నిరీక్షణ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రైతాంగం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంశధార నదిపై నేరడి బ్యారేజి నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జిల్లా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. రెండు రాష్ట్రాల మధ్య సున్నితమైన అంశంగా ఉన్న ఈ ప్రాజెక్టును పరిష్కరించేందుకు పార్లమెంట్‌లో నిరంతరం గళం ఎత్తడం, కేంద్ర మంత్రులతో సంప్రదింపులు జరపడం వల్ల నేడు ఈ విజయం సాధ్యమైంది.
నేరడి బ్యారేజి పూర్తయితే శ్రీకాకుళం జిల్లా మరింత సస్యశ్యామలం అవుతుంది. ఈ విషయంలో సహకరించిన కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్.పాటిల్‌కి , ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అంటూ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ప్రజా పోరాటానికి దక్కిన ఫలితం పాలకుల సహకారం
ఈ మూడు కీలక విజయాలు కేవలం విన్నపాలతోనే కాకుండా, నిరంతర క్షేత్రస్థాయి పోరాటాలు, రాజకీయ పట్టుదల వల్ల లభించినవి. ముఖ్యంగా నేరడి బ్యారేజి , రైల్వే స్టేషన్ల విలీనం వంటి అంశాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందించిన మార్గదర్శకత్వం, సరైన కార్యాచరణ శ్రీకాకుళం ప్రజలకు మేలు చేకూర్చింది. జిల్లా సమగ్ర అభివృద్ధికి ఈ మూడు ప్రాజెక్టులు వెన్నెముకగా నిలుస్తాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేయడం వల్లే ఇన్ని ఏళ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభించాయి. ఇది శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి విజయం అన్నారు.
ఈ నూతన మార్పులు, ఉత్తర్వులతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారనుందని, రైల్వే జోన్ విస్తరణతో స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగుపడటమే కాకుండా, నేరడి బ్యారేజి ద్వారా సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయని తెలిపారు.
పాతపట్నం ఆర్.ఓ.బి మార్పు ద్వారా ఆధ్యాత్మికతకు, అభివృద్ధికి మధ్య సమతుల్యతను కాపాడటం జరిగింది. శ్రీకాకుళం ఉత్తరాంధ్ర అభివృద్ధికి లభించిన ఈ అవకాశాలను భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా వినియోగించుకుని, జిల్లాను ప్రగతి పథంలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా ముందుకు సాగుతాము. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, సహకరించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి ధన్యవాదాలు అంటూ ముగించారు.
