Let's talk: editor@tmv.in
నేరం ఆధునికమైతే... పోలీసింగ్ అంతకంటే ఆధునికం కావాలి: హోంమంత్రి అనిత

నేరం ఆధునికమైతే... పోలీసింగ్ అంతకంటే ఆధునికం కావాలి: హోంమంత్రి అనిత

Gaddamidi Naveen
22 జులై, 2026

ఆధునిక సాంకేతికతతో నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన 'ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్-2026' కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రవ్యాప్త పోలీస్ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.

2001లో అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పోలీసు సంస్కరణల రిట్రీట్ సంప్రదాయాన్ని 25 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభించడం చారిత్రాత్మకమని హోంమంత్రి అన్నారు. భవిష్యత్ సవాళ్లను ముందుగానే అంచనా వేసి పోలీసు వ్యవస్థను సిద్ధం చేయడమే ఈ రిట్రీట్ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు, వామపక్ష తీవ్రవాదం, మతకలహాలను గణనీయంగా అదుపులోకి తీసుకువచ్చామని, ఇప్పుడు సైబర్ నేరాలు, రౌడీయిజం, సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని వాస్తవాలు, ఆధారాలతో తిప్పికొట్టే బాధ్యత పోలీసులదేనని, ప్రతి ఘటనపై పారదర్శకంగా సమాచారం అందించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచవచ్చని ఆమె సూచించారు. మహిళలు, చిన్నారుల భద్రత ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతగా ఉందని, మహిళలపై నమోదవుతున్న నేరాలను సుమారు నాలుగు శాతం మేర తగ్గించగలిగామని తెలిపారు. గంజాయి నిర్మూలన కోసం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ ద్వారా సాగు, అక్రమ రవాణాపై సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

112 అత్యవసర స్పందన వ్యవస్థలో స్పందన సమయాన్ని గణనీయంగా తగ్గించామని, పోలీసింగ్‌లో గోల్డెన్ టైమ్ కీలకమని హోంమంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని, భవిష్యత్తులో ప్రతి జాబ్ క్యాలెండర్‌లో కొత్త నియామకాలతో పోలీసు శాఖను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

రాబోయే 20 ఏళ్ల భవిష్యత్ ప్రణాళిక - డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక పోలీసింగ్ వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు. నమోదైన కేసుల సంఖ్య కంటే ముందుగానే నివారించిన నేరాల ఆధారంగా పోలీసుల పనితీరును అంచనా వేసే విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. సైబర్ మోసాలు, డీప్‌ఫేక్‌లు, విదేశాల నుంచి జరిగే సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు ముందస్తు నిఘా వ్యవస్థలను బలోపేతం చేయనున్నట్లు వెల్లడించారు.

డ్రోన్ నిఘా కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటు, కోడింగ్, క్రిప్టోగ్రఫీ, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలు కలిగిన యువతను పోలీసు బలగాల్లోకి తీసుకురానున్నట్లు తెలిపారు. 112 సేవలను మరింత వేగవంతం చేయడం, పోలీసు-వైద్య-మహిళా సంక్షేమ శాఖల సమన్వయంతో డిజిటల్ హెల్త్ అండ్ సేఫ్టీ గ్రిడ్, ప్రిడిక్టివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థలను దశలవారీగా అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచే ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ వ్యవస్థను నిర్మిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.