
నేపాల్ విద్యా వ్యవస్థలో ‘బాలెన్’ మార్క్.. సమూల ప్రక్షాళన!
నేపాల్ నూతన ప్రధాని బాలేంద్ర షా (బాలెన్ షా) నేతృత్వంలోని రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రభుత్వం దేశ విద్యావ్యవస్థలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. బాధ్యతలు చేపట్టిన తొలి కేబినెట్ సమావేశంలోనే విద్యా రంగాన్ని ప్రక్షాళన చేస్తూ 100 పాయింట్ల అజెండాను ప్రభుత్వం విడుదల చేసింది. విద్యను మరింత సమ్మిళితంగా, విద్యార్థి స్నేహపూర్వకంగా మార్చడమే లక్ష్యంగా ఈ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
క్యాంపస్‌లలో రాజకీయాలకు చెక్
నేపాల్ విద్యారంగంలో రాజకీయ జోక్యాన్ని పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలపై నిషేధం విధించారు. నిర్దేశించిన గడువులోగా క్యాంపస్‌ల నుంచి తమ కార్యకలాపాలను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. రాజకీయ రహితంగా విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు 90 రోజుల్లోగా 'స్టూడెంట్ కౌన్సిల్స్'ను ఏర్పాటు చేయనున్నారు. కేవలం విద్యార్థులే కాదు.. టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏ రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉండకూడదని, వారి ట్రేడ్ యూనియన్లను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
పరీక్షల ఒత్తిడి లేని ప్రాథమిక విద్య
చిన్న వయసులోనే విద్యార్థులపై పరీక్షల భారం పడకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదో తరగతి వరకు విద్యార్థులకు సాంప్రదాయ పరీక్షలను రద్దు చేశారు. వారి ప్రగతిని కేవలం మానసిక, ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతుల ద్వారానే అంచనా వేస్తారు. అలాగే డిగ్రీ ప్రవేశాల కోసం పౌరసత్వ ధ్రువీకరణ పత్రం (సిటిజన్‌షిప్) ఉండాలనే నిబంధనను తొలగించి విద్యార్థులకు ఊరటనిచ్చింది. ఇక యూనివర్సిటీల్లో కూడా పరీక్షల ఫలితాలు ఆలస్యం కాకుండా క్యాలెండర్ ప్రకారం సమయానికి విడుదల చేయాలని ప్రభుత్వం గట్టి ఆదేశాలు జారీ చేసింది.
నేపాలీ అస్తిత్వమే లక్ష్యం
విదేశీ పేర్లతో నడుస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆక్స్‌ఫర్డ్, పెంటగాన్, సెయింట్ జేవియర్స్ వంటి విదేశీ పేర్లను కలిగి ఉన్న పాఠశాలలు ఈ ఏడాది చివరికల్లా తమ పేర్లను మార్చుకోవాలని ఆదేశించింది. జాతీయ అస్తిత్వాన్ని చాటిచెప్పేలా నేపాలీ మూలాలున్న పేర్లను మాత్రమే పెట్టుకోవాలని స్పష్టం చేసింది. వీటితో పాటు ఉపాధ్యాయుల పెన్షన్ వ్యవస్థను వికేంద్రీకరిస్తూ వచ్చే ఆర్థిక ఏడాది నుంచి ప్రావిన్షియల్ విద్యా మంత్రిత్వ శాఖలకు ఆ బాధ్యతలను అప్పగించనున్నారు.
