
నేపాల్ వరదల్లో 8 మంది ఏపీ యాత్రికులు గల్లంతు
నేపాల్‌లో భారీ వరదల కారణంగా కనీసం 8 మంది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు గల్లంతైనట్లు సమాచారం. వారి వివరాలను నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయానికి అందించినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన వారిలో చొప్పరపు రమేశ్‌బాబు (53), అన్నందేవర వెంకట్రామ్ (52), అన్నందేవర అనఘ (49) ఉన్నారు. వీరి ఆచూకీ టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం. మరో యాత్రికుడు బాల సుబ్రహ్మణ్యం ఆచూకీ తెలియడం లేదు. సశికుమార్ అట్లూరి, రాజ్యలక్ష్మి నిమ్మగడ్డ చివరిసారిగా చైనాలోని గ్యిరాంగ్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉన్నట్లు సమాచారం. భాస్కర్ శాస్త్రి, మరో ముగ్గురు సురక్షితంగానే ఉన్నప్పటికీ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అపర్ణ కాకాని ఆగస్టు 26 సాయంత్రం వరకు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది.
288 మంది భారతీయులతో తెగిపోయిన సంబంధాలు
ఇదిలా ఉండగా, నేపాల్‌లో సంభవించిన భారీ వరదల నేపథ్యంలో 288 మంది భారతీయులతో సంబంధాలు తెగిపోయినట్లు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. కైలాస్ మానస సరోవర్ యాత్రకు వెళ్లిన సుమారు 200 మంది భారతీయులు తమను తరలించాలని కోరినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. సద్గురు ఇషా ఫౌండేషన్‌కు చెందిన పెద్ద బృందం కూడా నేపాల్‌లో ఆచూకీ తెలియకుండా ఉందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడుకు చెందిన 21 మందిని ఇప్పటికే సురక్షితంగా తరలించినట్లు తెలిపారు. కొందరు భారతీయులు చైనా వైపు కూడా చిక్కుకుపోయారని వెల్లడించారు.
నేపాల్ వరదల్లో కుప్పం వాసి గల్లంతు
నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పట్టణానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం గల్లంతయ్యారు. ఆగస్టు 26 నుంచి ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ అందుబాటులోకి రాలేదు. మొబైల్ ఫోన్ పనిచేయకపోవడంతో ఆచూకీ తెలియడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఈశా ఫౌండేషన్‌కు సంబంధించిన బృందంతో కలిసి నేపాల్‌కు వెళ్లినట్లు ఆయన సోదరుడు శ్రీకాంత్ వెల్లడించారు. ఆగస్టు 14న ఖాట్మండూ నుంచి నేపాల్‌లోని ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఆయన.. మంగళవారం ఉదయం చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అంతా క్షేమంగానే ఉందని, ఆగస్టు 29న బృందం హైదరాబాద్‌కు చేరుకోవాల్సి ఉందని చెప్పినట్లు శ్రీకాంత్ తెలిపారు.
అయితే బుధవారం ఉదయం ఆ బృందం గ్యిరాంగ్ ఇమ్మిగ్రేషన్ సెంటర్‌లో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆకస్మిక వరదలు సంభవించినట్లు తెలిసింది. దీంతో బాలసుబ్రహ్మణ్యం ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాలయానికి తెలియజేశారు. భారత రాయబార కార్యాలయం, ప్రభుత్వ అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని గుర్తించి సహాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, హెల్ప్‌లైన్ నంబర్లు కూడా అందుబాటులోకి తెచ్చిందని శ్రీకాంత్ తెలిపారు.
ఇదిలా ఉండగా.. నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగానే ఉన్నట్లు ఢిల్లీలోని ఏపీ భవన్ పరిస్థితి నివేదిక వెల్లడించింది. భారీ వరదలతో కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడగా.. సహాయక, రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది సుమారు 15 హెలికాప్టర్లతో విస్తృతంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. భారత్ కూడా మానవతా సాయం అందిస్తూ.. ఐఏఎఫ్‌కు చెందిన సీ-130జే విమానం ద్వారా 10 టన్నుల సహాయ సామగ్రిని నేపాల్‌కు పంపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులను గుర్తించడం, రక్షించడం, సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ఏపీ భవన్ భారత దౌత్య కార్యాలయాలు, నేపాల్, చైనా అధికారులతో పాటు యాత్రా సంస్థలతో సమన్వయం చేస్తోంది.
నేపాల్ వరదలపై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం
నేపాల్‌లో భారీ వరదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్రానికి చెందిన ఎవరైనా చిక్కుకున్నారా అనే వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ వాసులను గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. నేపాల్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేసుకుంటోంది. అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు, ఇతర రాష్ట్ర వాసులకు అవసరమైన సహాయాన్ని అందించేలా చర్యలు తీసుకుంటోంది.
ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నేపాల్ వరదల నేపథ్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నేపాల్‌లో ఉన్న ఏపీ వాసుల వివరాలను సేకరించడంతో పాటు వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్ ద్వారా సమన్వయం చేస్తున్నారు.
ఏపీ భవన్ కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు
011-23384016, 011-23387089, వాట్సాప్: 9059824101 నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర వాసులు లేదా వారి కుటుంబ సభ్యులు పై నంబర్లను సంప్రదించి సమాచారం అందించవచ్చు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, బాధిత యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
