Let's talk: editor@tmv.in
నేపాల్ మాజీ ప్రధాని పాస్‌పోర్ట్ సీజ్‌!

నేపాల్ మాజీ ప్రధాని పాస్‌పోర్ట్ సీజ్‌!

Venkatesh Balusula
30 సెప్టెంబర్, 2025

నేపాల్ మాజీ ప్రధానమంత్రి కేపీ శ‌ర్మ ఒలీకి ఆ దేశ హోం మంత్రిత్వ‌ శాఖ షాకిచ్చింది.ఒలీతో పాటు మ‌రో న‌లుగురు నేత‌ల పాస్‌పోర్టును సీజ్ చేసింది. ఈ నెలలో జెన్ జెడ్ ఆందోళ‌న‌ల్లో హింసాత్మక అణచివేత కేసులో ఈ నిర్ణ‌యం తీసుకుంది. సోమవారం ఖాట్మాండులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మ‌రో ఆందోళ‌న‌కారుడు చనిపోయాడు. దీంతో ఆందోళ‌న‌ల్లో మరణాల సంఖ్య 76కు చేరింది. సుశీల కర్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన కొన్ని రోజుల తర్వాత, సెప్టెంబర్ 21న కేబినెట్ సమావేశం నిర్వ‌హించారు. ఇందులో జెన్ జెడ్ ఆందోళ‌న‌ల్లో సెక్యూరిటీ ఏజెన్సీల చ‌ర్య‌ల వ‌ల్ల జ‌రిగిన ఘటనల‌ను విచారించడానికి న్యాయ విచార‌ణ‌ కమిషన్ ఏర్పాటు చేశారు. ఆదివారం ఈ కమిషన్ ఒలీ, మరో నలుగురి పాస్‌పోర్ట్‌లు ఫ్రీజ్ చేయాలని సిఫార్సు చేసింది.

కమిషన్ సిఫార్సు మేరకు హోం శాఖ పాస్‌పోర్ట్‌లను ఫ్రీజ్ చేసింది. అప్పటి గృహ కార్యదర్శి గోకర్ణ మణి దువాడి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ చీఫ్ హుతరాజ్ థాపా, ఖాట్మాండు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఛబీ రిజల్ ఈ జాబితాలో ఉన్నారని అధికారులు చెప్పారు. దీంతో ఈ ఐదుగురు దేశం విడిచి వెళ్లలేరు. విచారణ జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు కమిషన్ చైర్ గౌరీ బహదూర్ కర్కీ వెల్ల‌డించారు. విజయ దశమి పండగ తర్వాత, విచారణ కమిషన్ ఉన్నతాధికారుల వివరణలు రికార్డు చేయనుంది. వీరు అధికారుల అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని ఆదేశించారు. ఈ నిర్ణ‌యంపై మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలీ స్పందించారు. తాను దేశం విడిచి వెళ్తున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌న్నారు. తాను ఎవరికీ భయపడనని.. దేశంలోనే ఉండి తన రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తానని స్ప‌ష్టం చేశారు. దేశంలో శాంతిభద్రతలు, రాజ్యాంగ పాలనను తిరిగి పునరుద్ధరించడానికి కట్టుబడి ఉన్నానన్నారు.

నేపాల్ మాజీ ప్రధాని పాస్‌పోర్ట్ సీజ్‌! - Tholi Paluku