
నేపాల్ మాజీ ప్రధాని దేవుబాపై అరెస్ట్ వారెంట్ జారీ
నేపాల్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా, ఆయన సతీమణి, మాజీ విదేశాంగ మంత్రి ఆర్జు దేవుబా రాణాలపై ఖాట్మండు జిల్లా కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో వీరిద్దరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, కోర్టు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఆస్తుల విచారణలో కీలక మలుపు
వీరిద్దరి ఆస్తులపై దర్యాప్తు చేస్తున్న మనీ లాండరింగ్ నిరోధక శాఖ అభ్యర్థన మేరకు కోర్టు మంగళవారం ఈ వారెంట్లను జారీ చేసింది. గతేడాది సెప్టెంబరులో ఖాట్మండు శివార్లలోని బుధనీల్‌కంఠలో ఉన్న వీరి నివాసంలో సగం కాలిన కరెన్సీ నోట్ల ముక్కలు లభ్యమయ్యాయి. ఈ ఘటన తర్వాతే వీరి అక్రమ ఆస్తులపై దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. కాగా ప్రస్తుతం దేవుబా దంపతులు సింగపూర్‌లో ఉన్నట్లు దర్యాప్తు వర్గాలను ఉటంకిస్తూ 'ది ఖాట్మండు పోస్ట్' పత్రిక పేర్కొంది.
రాజకీయ ప్రస్థానం.. నిరసనల సెగ
నేపాల్ రాజకీయాల్లో షేర్ బహదూర్ దేవుబా కీలక నేత. ఆయన ఐదు సార్లు దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన సతీమణి ఆర్జు దేవుబా, గతంలోని కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. అయితే గత సెప్టెంబరులో చోటుచేసుకున్న భారీ నిరసనల కారణంగా ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ సమయంలో 'జెన్-జెడ్' నిరసనకారులు వీరి ఇంటికి నిప్పు పెట్టగా, ఆ ప్రమాదంలో దేవుబా దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.
రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం?
తాజా వారెంట్ల నేపథ్యంలో ఒకవేళ దేవుబా దంపతులు కోర్టు ముందు హాజరు కాకపోతే తదుపరి చర్యలు మరింత కఠినంగా ఉండనున్నాయి. చట్టపరమైన నిబంధనల ప్రకారం వారిని రప్పించేందుకు అంతర్జాతీయ స్థాయిలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసే అవకాశం కూడా ఉందని 'ది హిమాలయన్ టైమ్స్' నివేదించింది.
