Let's talk: editor@tmv.in
నేపాల్ మాజీ ప్రధాని ఓలీకి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

నేపాల్ మాజీ ప్రధాని ఓలీకి 5 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Shaik Mohammad Shaffee
30 మార్చి, 2026

నేపాల్ మాజీ ప్రధాని కె.పి. శర్మ ఓలీకి ఖాట్మండు జిల్లా కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. గత ఏడాది సెప్టెంబరులో జరిగిన 'జెన్-జెడ్' ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేసి, సుమారు 76 మంది మరణానికి కారణమయ్యారన్న ఆరోపణలపై శనివారం ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓలీతో పాటు అప్పటి హోంమంత్రి రమేష్ లేఖక్‌ను కూడా కోర్టు ఐదు రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రధాని బాలేంద్ర షా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన వెంటనే.. గత అల్లర్లపై ఏర్పాటైన దర్యాప్తు కమిషన్ నివేదికను అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి.

ఆస్పత్రి నుంచే విచారణకు..

అరెస్టు అనంతరం ఓలీ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ను త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌కు తరలించారు. కిడ్నీ మార్పిడి, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న ఆయన, కోర్టు విచారణకు ఆస్పత్రి నుంచే వర్చువల్‌గా హాజరయ్యారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో కస్టడీ కాలంలో ఆయన ఆస్పత్రిలోనే ఉంటారని కోర్టు స్పష్టం చేసింది. మరోవైపు మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్‌ను పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో ప్రవేశపెట్టి, తదుపరి విచారణ కోసం పది రోజుల కస్టడీ కోరగా, న్యాయస్థానం ఐదు రోజులకు అనుమతించింది.

దేశవ్యాప్తంగా భగ్గుమన్న నిరసనలు

తమ పార్టీ అధ్యక్షుడు ఓలీ అరెస్టును నిరసిస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూఎంఎల్) కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కాఠ్మాండులోని మైతీఘర్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించిన పార్టీ శ్రేణులు, ఈ అరెస్టులు రాజకీయ కక్షసాధింపు చర్యలేనని ఆరోపించాయి. అన్ని జిల్లాల పరిపాలనా కార్యాలయాల్లో నిరసన పత్రాలను సమర్పించడమే కాకుండా, ఓలీని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. దర్యాప్తు కమిషన్ సిఫార్సులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని పార్టీ హెచ్చరించింది.

సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

రాజకీయ దిగ్గజాల అరెస్టు నేపాల్ న్యాయస్థానాల్లో కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఓలీ, రమేష్ లేఖక్‌లను అక్రమంగా నిర్బంధించారంటూ వారి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వం కావాలనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని అందులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. మరోవైపు సెప్టెంబర్ నాటి నిరసనల్లో యువత మరణాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

మనీలాండరింగ్ ఉచ్చులో మాజీ మంత్రి ఖడ్కా

ఇదే సమయంలో నేపాల్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఇంధన శాఖ మంత్రి దీపక్ ఖడ్కాను మనీలాండరింగ్ కేసులో పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇంధన శాఖ మంత్రిగా ఉన్న సమయంలో లైసెన్సులు, కాంట్రాక్టుల కేటాయింపులో భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది నిరసనల సమయంలో ఖడ్కా నివాసంతో పాటు మాజీ ప్రధానులు షేర్ బహదూర్ దేవుబా, పుష్ప కమల్ దహల్ నివాసాల్లో కాల్చివేసిన కరెన్సీ నోట్ల ముక్కలు దొరకడం సంచలనం సృష్టించింది. ఫోరెన్సిక్ పరీక్షల్లో ఇవి నిజమైన కరెన్సీ నోట్లేనని తేలడంతో మనీలాండరింగ్ విభాగం రంగంలోకి దిగింది.

అవినీతి రహిత పాలనే లక్ష్యం

ప్రధాని బాలేంద్ర షా ప్రభుత్వం తన 100 పాయింట్ల అజెండాలో అవినీతి నిర్మూలనకు పెద్దపీట వేసింది. ఆస్తుల దాచివేత, అధికార దుర్వినియోగం వంటి చర్యల ద్వారా దేశాన్ని దోచుకున్న వారిని వదిలేది లేదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 1990 నుండి ఇప్పటివరకు పదవుల్లో ఉన్న అందరి ఆస్తులపై విచారణ జరుపుతామని ప్రకటించిన నేపథ్యంలో, రానున్న రోజుల్లో మరికొంతమంది కీలక నేతల అరెస్టులు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలతో నేపాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.