Let's talk: editor@tmv.in
నేపాల్ మాజీ ప్రధాని ఓలీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

నేపాల్ మాజీ ప్రధాని ఓలీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

Shaik Mohammad Shaffee
31 మార్చి, 2026

నేపాల్ రాజకీయాల్లో ప్రకంపనలు కొనసాగుతున్నాయి. గతేడాది జరిగిన 'జెన్-జెడ్' ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసి, 76 మంది మరణానికి కారణమయ్యారనే ఆరోపణలపై అరెస్టయిన మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీకి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఏ ప్రాతిపదికన ఆయనను అరెస్ట్ చేశారో వివరణ ఇవ్వాలని కోరుతూ బాలేంద్ర షా ప్రభుత్వానికి జస్టిస్ మేఘరాజ్ పోఖ్రేల్ నేతృత్వంలోని ధర్మాసనం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

అక్రమ అరెస్ట్ అంటూ సతీమణి పిటిషన్

ఓలీ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన భార్య రాధికా శాక్యా 'హేబియస్ కార్పస్' పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అక్రమంగా అరెస్ట్ చేసిందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. దర్యాప్తు కమిషన్ నివేదికను బహిరంగ పరచకుండానే, అత్యవసర అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ అడ్వకేట్ టికారం భట్టారాయ్ పేర్కొన్నారు. ఓలీతో పాటు మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ దాఖలు చేసిన పిటిషన్‌పై కూడా కోర్టు ఇదే విధమైన స్పందన వ్యక్తం చేసింది. ప్రస్తుతం వీరిద్దరికీ జిల్లా కోర్టు ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఆస్పత్రిలోనే విచారణ.. నిరసనల హోరు

అరెస్ట్ అనంతరం అనారోగ్యానికి గురైన ఓలీ, ప్రస్తుతం మహారాజ్‌గంజ్‌లోని త్రిభువన్ విశ్వవిద్యాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కస్టడీ కాలంలో ఆయన ఆస్పత్రిలోనే ఉండనున్నారు. మరోవైపు ఓలీ మద్దతుదారులు, సిపిఎన్-యూఎంఎల్ పార్టీ శ్రేణులు కాఠ్మాండూ వీధుల్లో భారీ నిరసనలు చేపట్టారు. "ఓలీని వెంటనే విడుదల చేయాలి", "కక్ష సాధింపు రాజకీయాలు నశించాలి" అంటూ నినాదాలు చేశారు. ఆదివారం నాటి నిరసనల్లో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో పలువురు గాయపడగా, సోమవారం నాటి ప్రదర్శనలు ప్రశాంతంగా సాగాయి.

ముగ్గురు మాజీ ప్రధానులపై విచారణ

అరెస్టుల పర్వం కేవలం 'జెన్-జెడ్' అణిచివేతకే పరిమితం కాలేదు. నేపాల్ మనీలాండరింగ్ దర్యాప్తు విభాగం మాజీ ప్రధానులు షేర్ బహదూర్ దేవుబా, పుష్ప కమల్ దహల్ (ప్రచండ), కేపీ శర్మ ఓలీలపై విచారణను ముమ్మరం చేసింది. మాజీ మంత్రి దీపక్ ఖడ్కా అరెస్ట్ తర్వాత బయటపడిన కీలక ఆధారాలతో ఈ విచారణ వేగం పుంజుకుంది. గతేడాది ఆందోళనల సమయంలో వీరి నివాసాల వద్ద కాలిపోయిన కరెన్సీ నోట్ల ముక్కలు లభ్యమయ్యాయని, ఫోరెన్సిక్ పరీక్షల్లో అవి నిజమేనని తేలడంతో అధికార యంత్రాంగం నిశితంగా పరిశీలిస్తోంది.

అవినీతి ఉచ్చులో మాజీ మంత్రి

మాజీ ఇంధన శాఖ మంత్రి దీపక్ ఖడ్కాపై అక్రమంగా లైసెన్సులు, కాంట్రాక్టులు కట్టబెట్టి భారీగా ఆర్థిక ప్రయోజనాలు పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం అరెస్టయిన ఆయన కూడా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. గత ఆరు నెలలుగా సాగుతున్న ప్రాథమిక విచారణలో లభించిన ఆధారాల బట్టే ఈ అరెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బాలేంద్ర షా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి కేబినెట్ సమావేశంలోనే పాత నివేదికలను అమలు చేయాలని నిర్ణయించడంతో ఈ పరిణామాలు చకచకా చోటుచేసుకుంటున్నాయి.