
నేపాల్ మధేశ్ ప్రావిన్స్‌లో టిక్‌టాక్ వీడియో వివాదం
టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసిన ఓ వీడియో కారణంగా మత ఉద్రిక్తతలు చెలరేగడంతో నేపాల్‌లోని మధేశ్ ప్రావిన్స్ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు. బిర్గంజ్, జనకపూర్ నగరాల్లో నిరసనలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అధికారుల సమాచారం ప్రకారం ధనుషా జిల్లా కమలా మున్సిపాలిటీలో రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదమే ఈ ఉద్రిక్తతలకు కారణమైంది. మతపరంగా అభ్యంతరకర వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపణలతో టిక్‌టాక్‌లో పోస్ట్ చేసిన వీడియోపై వివాదం మొదలైంది. ఈ ఘటన బిర్గంజ్, జనకపూర్ ప్రాంతాల్లో ఆందోళనలకు దారి తీసింది.
ఈ వివాదానికి కారణమైన వీడియోను హైదర్ అన్సారీ, అమానత్ అన్సారీ అనే ఇద్దరు యువకులు ధనుషా జిల్లా జనకపూర్‌లో టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వీడియో మత భావాలను దెబ్బతీసిందని స్థానికులు ఆరోపిస్తూ వారిని పోలీసులకు అప్పగించారు. టిక్‌టాక్ వీడియోను అప్‌లోడ్ చేసినందుకు, అలాగే విధ్వంస ఘటనల్లో పాల్గొన్నందుకు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని ధనుషా జిల్లా పోలీసు ప్రతినిధి, డిప్యూటీ సూపరింటెండెంట్ గణేష్ బామ్ మీడియాకు తెలిపారు.
ఈ ఘటన అనంతరం కమలా మున్సిపాలిటీ వార్డు నెంబర్–6లోని ఓ మసీదుపై దాడి జరగడం ఉద్రిక్తతలను మరింత పెంచింది. దీనికి నిరసనగా బిర్గంజ్ పరిసరాల్లో ఆందోళనకారులు ర్యాలీలు నిర్వహించి, టైర్లను తగలబెట్టి నినాదాలు చేశారు. బిర్గంజ్‌లోని చాప్కయ్యా ఇద్‌గాహ్ చౌక్ వద్ద నిరసనకారులు–పోలీసుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ఐదు రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని నియంత్రించేందుకు ఐదు రౌండ్ల టియర్ గ్యాస్ ప్రయోగించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని పార్సా జిల్లా పోలీస్ చీఫ్ సుదిప్రజ్ పాఠక్ తెలిపారు.
ఈ ఘర్షణల్లో ఏడుగురు పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. పోలీసులు కనీస బలప్రయోగంతో పరిస్థితిని నియంత్రించడమే లక్ష్యంగా పనిచేశారని తెలిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మధేశ్ ప్రావిన్స్‌లోని ఎనిమిది జిల్లాల్లో భద్రతను పెంచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ధనుషా, పార్సా జిల్లాల నుంచి మొదలైన ఈ ఉద్రిక్తతలు, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా ద్వారా మరింత వ్యాప్తి చెంది, మత–సామాజిక భావోద్వేగాలను రెచ్చగొట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
