Let's talk: editor@tmv.in
నేపాల్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షా
నేపాల్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షా

నేపాల్‌ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన బాలేంద్ర షా

Shaik Mohammad Shaffee
28 మార్చి, 2026

నేపాల్ రాజకీయాల్లో ఒక సరికొత్త శకం ఆరంభమైంది. ఆ దేశ 47వ ప్రధానమంత్రిగా యువనేత బాలేంద్ర షా (బాలెన్‌ షా) శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష భవనమైన ‘శీతల్‌ నివాస్‌’లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అధ్యక్షుడు రాంచంద్ర పౌడెల్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. కేవలం 35 ఏళ్ల వయసులోనే ఈ అత్యున్నత బాధ్యతలు చేపట్టిన బాలెన్, నేపాల్ చరిత్రలో అతి తక్కువ వయసులో ప్రధాని పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, ప్రధాన న్యాయమూర్తి ప్రకాష్ మాన్ సింగ్ రౌత్ సహా పలువురు దౌత్యవేత్తలు పాల్గొన్నారు.

నిరసనల నుంచి నిర్దేశం వరకు

బాలెన్ షా ప్రస్థానం అత్యంత ఆసక్తికరం. వృత్తిరీత్యా స్ట్రక్చరల్ ఇంజనీర్ అయిన ఆయన, అండర్‌గ్రౌండ్ ర్యాప్ సంగీత ప్రపంచంలోనూ మంచి గుర్తింపు పొందారు. 2025 సెప్టెంబర్‌లో యువత (జెన్-జెడ్) చేపట్టిన నిరసనల తర్వాత పాత పార్లమెంటు రద్దు కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని 'రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ' (ఆర్ఎస్పీ) 182 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాల రాజకీయ దిగ్గజాలైన నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యూఎంఎల్ వంటి పార్టీలకు ఈ యువ కెరటం చెక్ పెట్టారు. ముఖ్యంగా మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గంలో 50 వేల ఓట్ల తేడాతో ఓడించి బాలెన్ సంచలనం సృష్టించారు.

కర్ణాటకలో చదువు.. మధేశ్ ప్రాంత తొలి ప్రధాని

బాలెన్ షాకు భారతదేశంతో విడదీయరాని అనుబంధం ఉంది. ఖట్మండులో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన, కర్ణాటకలోని 'విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ'లో మాస్టర్స్ పట్టా పొందారు. నేపాల్ చరిత్రలో మధేశ్ ప్రాంతం నుండి ప్రధాని పదవిని చేపట్టిన మొదటి వ్యక్తిగా కూడా ఆయన రికార్డుకెక్కారు. నల్లటి కళ్ళద్దాలు, బ్లాక్ బ్లేజర్, తన వెంట ఉంచుకునే ఒక చిన్న ‘గంట’ (పార్టీ గుర్తు) ఆయనకు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి. 2022లో ఖట్మండు మేయర్‌గా ఎన్నికైనప్పుడే అక్రమ కట్టడాల కూల్చివేత, నగర సుందరీకరణతో ‘టైమ్’ మేగజైన్ 100 మంది వర్ధమాన నేతల జాబితాలో నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

మోడీ అభినందనలు

బాలెన్ షా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ‘ఎక్స్’ వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "మీపై నేపాల్ ప్రజలు ఉంచిన నమ్మకానికి ఈ నియామకం నిదర్శనం. భారత్-నేపాల్ మధ్య ఉన్న పురాతన మైత్రిని, సహకారాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి మీతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం ఈ బంధం మరింత బలోపేతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

పారదర్శక పాలనే లక్ష్యం

అవినీతి రహిత పాలన, పారదర్శకత లక్ష్యంగా బాలెన్ షా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించడం, రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన బ్యూరోక్రసీని నిర్మించడం వంటి 100 అంశాల నిబద్ధతతో కూడిన మేనిఫెస్టోను ఆయన ప్రజల ముందుకు తెచ్చారు. మేయర్‌గా ఉన్నప్పుడే వృత్తి విద్యా కోర్సులు, పేదలకు ఉచిత వైద్యం అందించి ‘గుడ్ గవర్నెన్స్’కు మారుపేరుగా నిలిచిన బాలెన్, ఇప్పుడు దేశ ప్రధానిగా నేపాల్ భవిష్యత్తును ఎలా మారుస్తారోనని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.