Let's talk: editor@tmv.in
నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్‌ ఘీసింగ్‌!

నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్‌ ఘీసింగ్‌!

Venkatesh Balusula
13 సెప్టెంబర్, 2025

నేపాల్‌ రాజ‌కీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మూడు రోజులుగా దేశవ్యాప్తంగా చెల‌రేగిన జెన్ జెడ్‌ ఉద్య‌మంతో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై నిషేదం, దేశంలో పెరిగిపోయిన అవినీతితో యువ‌త ప్ర‌భుత్వంపై తిర‌గ‌బ‌డ్డారు. ఈ ఆందోళ‌న‌ల‌తో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. ప్ర‌ధాన‌మంత్రి కేపీ శర్మ ఒలి, హోం మంత్రి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు. దేశాన్ని సైన్యం ఆధీనంలోకి తీసుకుంది. ప్ర‌జ‌ల‌ను శాంతింప‌జేసేందుకు తాత్కాలిక ప్ర‌భుత్వ‌ ఏర్పాటు కోసం క‌సరత్తు వేగ‌వంత‌మైంది. ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో నేపాల్ ప్ర‌ధాని బాధ్య‌త‌లు ఎవ‌రు చేప‌డ‌తార‌న్న దానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ ప‌ద‌వి కోసం ప్ర‌ధానంగా మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కర్కి, ఖాట్మాండు మేయర్‌ బాలేంద్ర షా, విద్యుత్తు బోర్డు మాజీ ఎండీ కుల్మన్‌ ఘీసింగ్ పేర్లు వినిపించాయి. చివ‌ర‌కు కుల్మ‌న్ ఘీసింగ్ పేరునే ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది.

కుల్మ‌న్‌కు అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు

నేపాల్‌లో విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించిన ఇంజినీర్‌గా కుల్మ‌న్‌కు గొప్ప పేరుంది. దేశ‌భ‌క్తుడిగా, ప్రజ‌లంద‌రికీ ఇష్ట‌మైన వ్య‌క్తిగా కుల్మ‌న్‌కు మద్దతు ఉంది. ఇంత‌కు ముందు పూర్వ ప్ర‌ధాన న్యాయ‌మూర్తి సుశీల‌ క‌ర్కీ పేరును కూడా ప‌రిశీలించినా, న్యాయ‌వ్య‌వ‌స్థ నుంచి రాజ‌కీయానికి రావ‌డం స‌రైన‌దేనా? అనే అభిప్రాయం వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది. అంతే కాకుండా ఆమె వ‌య‌సు(73) రీత్యా కూడా ఈ ప‌ద‌వి ఇబ్బందిక‌రంగా మారుతుంద‌న్న అభిప్రాయాలు వినిపించాయి. మ‌రో ప్ర‌తిపాదిత అభ్య‌ర్థి బాలేంద్ర‌ షా యువత‌లో మంచి గుర్తింపు ఉన్న వ్య‌క్తి. ఆయ‌న తాత్కాలికంగా బాధ్యతలు స్వీకరించాలన్న ప్ర‌తిపాద‌న‌ను తిరస్కరించ‌డంతో కొత్త ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ఈ నేప‌థ్యంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు, యువ‌త మ‌ద్ద‌తు క‌లిగి ఉన్న కుల్మ‌న్‌ను తాత్కాలిక‌ ప్ర‌ధానిగా నియ‌మించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీనిపై నిర్ణ‌యం కూడా తీసుకున్నార‌ని, త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న రానుంద‌ని స్థానిక రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

ప్ర‌ధాని ఎవ‌రైనా స‌మ‌స్య‌ల‌తోనే స్వాగ‌తం

నేపాల్ ఆర్మీ తాత్కాలికంగా క‌ర్ఫ్యూ విధించి బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తోంది. 48 గంటల్లో తాత్కాలిక ప్ర‌ధానిని నియ‌మించ‌క‌పోతే అత్య‌వ‌స‌ర స్థితిని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. సింగ‌హ్ ద‌ర్బార్ వంటి చారిత్ర‌క భ‌వ‌నాలు, పార్ల‌మెంట్ బిల్డింగ్‌లు దాడులకు గుర‌య్యాయి. 1,300 మందికి పైగా గాయాల‌పాల‌య్యారు. ప‌ర్యాట‌కులు, ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను రోడ్ల మీద‌ ప‌రుగులు పెట్టించి చిత‌క‌బాదారు. ఆందోళ‌న‌ల‌కు సోష‌ల్ మీడియా నిషేధం మూల‌కార‌ణ‌మైనా, దేశంలో నెల‌కొన్న ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ యువ‌త ఆవేద‌నతో ఉద్య‌మించింద‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో నేపాల్ ప్ర‌ధానికి ఎవ‌రు బాధ్య‌త‌లు చేప‌ట్టినా ఎన్నో స‌మ‌స్య‌లు ఎదురుకానున్నాయి. కుల్మన్ ఘీసింగ్ పేరు బ‌లంగా వినిపిస్తుండ‌టంతో విద్యుత్ రంగంలో మార్పులు తీసుకొచ్చిన‌ట్లు దేశానికి ఆయ‌న‌ మ‌రో కొత్త దారి చూపించగలరా? అనే చ‌ర్చ న‌డుస్తోంది. మ‌రోవైపు సైన్యం చెప్పినట్టుగా తాత్కాలికంగా మాత్రమే అధికారాన్ని నిలుపుకుంటారా? లేక నేపాల్ రాజ‌కీయాలు మరో మలుపు తీసుకుంటాయా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్‌ ఘీసింగ్‌! - Tholi Paluku