
నేపాల్ చిత్తు.. సెమీస్‌కు భారత మహిళల ‘ఏ’ జట్టు
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత ‘ఏ’ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం జరిగిన గ్రూప్-ఏ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాధా యాదవ్ సేన 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘనవిజయం సాధించి, సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది. తొలి మ్యాచ్‌లో యూఏఈ చేతిలో ఎదురైన పరాభవం నుంచి కోలుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. వరుసగా పాకిస్థాన్ ‘ఏ’, నేపాల్ జట్లపై భారీ విజయాలు నమోదు చేసి 4 పాయింట్లు (+3.042 నెట్ రన్ రేట్)తో గ్రూప్ టేబుల్‌లో అగ్రస్థానానికి చేరుకుంది.
తనూజా కన్వర్ ధాటికి నేపాల్ కుదేల్
టెర్డ్‌థాయ్ క్రికెట్ మైదానంలో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదో ఓవర్లోనే బిందు రావల్‌ను అవుట్ చేయడం ద్వారా మిన్ను మణి వికెట్ల పతనాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భారత స్పిన్నర్ తనూజా కన్వర్ (4/12) తన స్పిన్ మాయాజాలంతో నేపాల్ టాప్, మిడిల్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. కేవలం 11 ఓవర్లలోనే నేపాల్ 59 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తనూజాకు తోడుగా మిన్ను మణి (3/8), కెప్టెన్ రాధా యాదవ్ (2/17) రాణించడంతో నేపాల్ 18 ఓవర్లలో కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. నేపాల్ బ్యాటర్లలో సంఝన ఖడ్కా (22) మాత్రమే కాస్త ప్రతిఘటించింది. మొత్తం 10 వికెట్లలో 9 వికెట్లు స్పిన్నర్లే పడగొట్టడం విశేషం.
లక్ష్యం చిన్నది.. విజయం నల్లేరుపై నడకే
అనంతరం 79 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 7.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే దీయా యాదవ్ అవుటైనా, వృందా దినేష్ (18 బంతుల్లో 39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించింది. మధ్యలో అనుష్క శర్మ, తేజల్ హసబ్నిస్ వికెట్లు పడినా భారత్ విజయం ఎప్పుడూ ప్రమాదంలో పడలేదు. ఈ విజయంతో గ్రూప్-ఏ నుంచి భారత్ నాకౌట్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ గ్రూపులో యూఏఈ, పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే తదుపరి మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ సెమీస్‌కు అర్హత సాధించింది.
సెమీఫైనల్ పోరు శుక్రవారం
మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్‌గా 2023లో ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్ తొలి ఎడిషన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు అదే జోరును కొనసాగిస్తూ వరుసగా రెండోసారి టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. గ్రూప్ దశలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న భారత్.. వచ్చే శుక్రవారం (ఫిబ్రవరి 20) నాడు జరగనున్న సెమీఫైనల్ పోరులో తలపడనుంది. గ్రూప్-బి లోని రెండో స్థానంలో నిలిచిన జట్టుతో భారత్ ఢీకొనే అవకాశం ఉంది.
