Let's talk: editor@tmv.in
నేపాల్ ఎన్నికలు: మార్చి 5న పోలింగ్.. మూడు రోజుల పాటు సెలవులు

నేపాల్ ఎన్నికలు: మార్చి 5న పోలింగ్.. మూడు రోజుల పాటు సెలవులు

Shaik Mohammad Shaffee
26 ఫిబ్రవరి, 2026

నేపాల్‌లో సాధారణ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భాగంగా మార్చి 5న జరగనున్న ఎన్నికల కోసం మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కమిషన్ సిఫార్సు మేరకు మార్చి 4, 5, 6 తేదీల్లో సెలవులను అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి, హోం మంత్రి ఓం ప్రకాష్ ఆర్యల్ వెల్లడించారు.

72 గంటల పాటు సరిహద్దు సీల్

ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారత్-నేపాల్ సరిహద్దుల్లో కఠిన ఆంక్షలు విధించారు. మధేష్ ప్రావిన్స్‌లోని బారా, పర్సా జిల్లాలను భారత్‌తో కలిపే సరిహద్దు మార్గాలను మూడు రోజుల పాటు పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. బిర్‌గంజ్‌లోని ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌లో భారత, నేపాల్ భద్రతా అధికారుల మధ్య జరిగిన సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 3 నుంచి ఎన్నికలు ముగిసే వరకు (72 గంటల పాటు) సరిహద్దులు సీల్ చేయాలని ఇరు దేశాల ప్రతినిధులు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు బారా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ధర్మేంద్ర కుమార్ మిశ్రా వివరాలు వెల్లడించారు.

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే వెన్నెముక

ఎన్నికల నిర్వహణ పట్ల నేపాల్ ఎన్నికల కమిషన్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలే వెన్నెముక వంటివని, సుపరిపాలన సాధ్యపడాలంటే ఎన్నికలు సక్రమంగా జరగాలని యాక్టింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రామ్ ప్రసాద్ భండారీ స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మార్చి 5నే ఎన్నికలు జరుగుతాయని ఆయన భరోసా ఇచ్చారు.

రాజకీయ అనిశ్చితి తర్వాత..

గత ఏడాది నేపాల్‌లో జరిగిన 'జెన్-జెడ్' ఆందోళనలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేశాయి. హింసాత్మక నిరసనల కారణంగా కె.పి. శర్మ ఓలి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో, ఈ పోలింగ్ ప్రక్రియపై అంతర్జాతీయంగా, స్థానికంగా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికల ఫలితాలు నేపాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.

24 గంటల్లోనే ఎన్నికల ఫలితాల వెల్లడి

మార్చి 5న జరగనున్న నేపాల్ సాధారణ ఎన్నికల ఫలితాలను బ్యాలెట్ బాక్సుల సేకరణ పూర్తయిన 24 గంటల్లోనే ప్రకటిస్తామని యాక్టింగ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రామ్ ప్రసాద్ భండారీ తెలిపారు. మొత్తం 275 స్థానాలకు గాను 165 మందిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా, 110 మందిని దామాషా (ప్రొపోర్షనల్) పద్ధతిలో ఎన్నుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 1.89 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ మార్చి 5న ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మహిళలు, దళితులు, గిరిజనులు, మధేషీలు వంటి వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు దామాషా పద్ధతిలో ప్రత్యేక కేటాయింపులు చేశారు.