Let's talk: editor@tmv.in
నేపాల్‌లో హిమపాతం: తొమ్మిది మంది పర్వతారోహకుల మృతి

నేపాల్‌లో హిమపాతం: తొమ్మిది మంది పర్వతారోహకుల మృతి

Shaik Mohammad Shaffee
5 నవంబర్, 2025

నేపాల్‌లో రెండు వేర్వేరు హిమపాత ఘటనల్లో కనీసం తొమ్మిది మంది పర్వతారోహకులు మరణించినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు నేపాలీ గైడ్‌లతో సహా విదేశీ పౌరులు ఉన్నట్లు తెలిపారు. గౌరీశంకర్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని యాలుంగ్ రి (6,920 మీటర్లు) పర్వతం వద్ద సోమవారం ఉదయం 10 గంటల సమయంలో హిమపాతం సంభవించింది. పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నిస్తున్న ఏడుగురు క్లైంబర్లు ఈ హిమపాతంలో చిక్కుకుని మరణించినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జ్ఞాన్ కుమార్ మహతో తెలిపారు.

మరణించిన వారిలో ఇద్దరు నేపాలీ పౌరులు, ఇద్దరు ఇటాలియన్లు (పాలో కొకో, మార్కో డి మార్సెల్లో), ఒక కెనడియన్, ఒక ఫ్రెంచ్, ఒక జర్మన్ జాతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఐదుగురిని (ముగ్గురు నేపాలీలు, ఇద్దరు ఫ్రెంచ్ జాతీయులు) కాఠ్మండులోని ఆసుపత్రులకు హెలికాప్టర్‌ల ద్వారా తరలించారు. స్వల్ప గాయాలైన మరో నలుగురు క్లైంబర్లను కూడా ఘటనా స్థలం నుంచి రక్షించారు.

ఇదిలా ఉండగా, మరొక ఘటనలో అక్టోబర్ 28 నుంచి కురుస్తున్న భారీ మంచు కారణంగా అదృశ్యమైన ఇద్దరు ఇటాలియన్ పర్వతారోహకులు పన్బారి పర్వతం (6,887 మీటర్లు)లోని క్యాంప్-I వద్ద మరణించి కనిపించారు. స్టెఫానో ఫర్రోనాటో, అలెస్సాండ్రో కపుటో అనే ఇద్దరు ఇటాలియన్ క్లైంబర్లు మంగళవారం తమ టెంట్‌లోనే మరణించి ఉండగా గుర్తించారు. వీరి మృతదేహాలను 5,242 మీటర్ల ఎత్తు నుంచి స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు చిక్కుకున్న మరో ఇటాలియన్‌ పర్వతారోహకుడు వెల్టర్ పరాలియన్‌ను ఆదివారం సురక్షితంగా రక్షించారు.

నేపాల్ టూరిజం బోర్డు పర్వతారోహకుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసింది. “హిమపాత ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిపట్ల మేము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాం. యాలుంగ్ రి పర్వతంలో మృతులైన ఏడుగురు పర్వతారోహకుల కుటుంబ సభ్యులు, మిత్రులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము” అని బోర్డు తమ సందేశంలో పేర్కొంది.

నేపాల్‌లో అక్టోబర్‌-నవంబర్‌ కాలం పర్వతారోహణకు అనుకూలం. ఎందుకంటే ఈ సమయంలో వర్షాలు తగ్గి, ఆకాశం స్వచ్చంగా ఉండి, హిమపాత ప్రమాదం తక్కువగా ఉంటుంది. పర్వతారోహకుల వెంట అనుభవజ్ఞులైన నేపాలీ గైడ్లు (షెర్పాలు) తప్పనిసరిగా ఉంటారు. వారు మార్గదర్శనం చేయడంతో పాటు భద్రతా ఏర్పాట్లు చూస్తారు. ఎక్కే తాడు, హెల్మెట్‌, ఆక్సిజన్‌ సిలిండర్లు వంటి పరికరాలు తీసుకెళ్తారు. వాతావరణ అంచనాలు పరిశీలించి, ఎత్తుకు శరీరాన్ని అలవాటు చేయడానికి దశలవారీగా ఎక్కుతారు. అయినా హిమపాతల వంటి ఆకస్మిక ప్రమాదాలు ఈ సాహస క్రీడలో సహజమనే చెప్పాలి.