Let's talk: editor@tmv.in
నేపాల్‌లో ముగిసిన పోలింగ్.. ప్రధాని పీఠం ఎవరిదో?

నేపాల్‌లో ముగిసిన పోలింగ్.. ప్రధాని పీఠం ఎవరిదో?

Shaik Mohammad Shaffee
6 మార్చి, 2026

హిమాలయ దేశం నేపాల్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో, అధికారులు బ్యాలెట్ బాక్సులను సీలు చేసి భద్రపరిచారు. ఈ ఎన్నికల్లో సుమారు 60 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం . దేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన ఈ ఎన్నికల ద్వారా నేపాల్ ప్రజలు తమ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోనున్నారు. నేపాల్ ప్రతినిధుల సభలోని 275 స్థానాలకు గాను ఒకే విడతలో 77 జిల్లాల్లో ఈ పోలింగ్ నిర్వహించారు.

యువత చేతిలో దేశ భవిష్యత్తు

ఈ ఏడాది ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 2022తో పోలిస్తే ఓటర్ల సంఖ్య సుమారు 9.15 లక్షలు పెరిగి, మొత్తం ఓటర్ల సంఖ్య 1,89,03,689కి చేరింది. ముఖ్యంగా మొత్తం ఓటర్లలో 52 శాతం మంది 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు గల యువతే కావడం విశేషం. అవినీతి అంతం, సుపరిపాలన, వారసత్వ రాజకీయాలకు స్వస్తి పలకడమే లక్ష్యంగా గతేడాది సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన యువత పోరాటం దేశ రాజకీయ చిత్రపటాన్నే మార్చేసింది. అప్పట్లో ప్రధానిగా ఉన్న ఓలీపై రెండు వంతుల మెజారిటీ ఉన్నా.. యువత ఆగ్రహంతో పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో యువ ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

పోటీలో వేలాది మంది అభ్యర్థులు

నేపాల్ పార్లమెంటులోని మొత్తం 275 సీట్ల కోసం ఈ ఎన్నికల్లో 6,541 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరిలో నేరుగా ఓట్లు వేసి గెలిపించుకునే 165 స్థానాల కోసం 1,143 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 3,406 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మిగిలిన 110 స్థానాలను పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఆధారంగా కేటాయించే పద్ధతిలో భర్తీ చేస్తారు. ఈ సీట్ల కోసం 63 రాజకీయ పార్టీలకు చెందిన 3,135 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

త్రిముఖ పోరు

నేపాల్ ఎన్నికల్లో ఈసారి పాత రాజకీయ పార్టీలకు కొత్త తరం నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తం 275 సీట్ల కోసం 6,541 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ప్రధానంగా ముగ్గురి మధ్య పోరు సాగుతోంది. ఖాట్మండు మాజీ మేయర్, మాజీ ర్యాపర్ అయిన బలేంద్ర షా తన ‘రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ’తో సంప్రదాయ పార్టీలకు సవాల్ విసురుతున్నారు. మరోవైపు నేపాలీ కాంగ్రెస్ తరఫున గగన్ థాపా ప్రధాని అభ్యర్థిగా పోటీ పడుతుండగా, మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన సిపిఎన్ (యుఎంఎల్) పార్టీని గెలిపించి మళ్లీ అధికారం చేపట్టాలని చూస్తున్నారు. వీరితో పాటు కుల్మాన్ ఘిసింగ్, హర్క సంపాంగ్ వంటి నేతలు కూడా తమ ప్రాంతాల్లో గట్టి ప్రభావం చూపుతూ పోటీని ఆసక్తికరంగా మార్చారు.

కట్టుదిట్టమైన భద్రత.. 24 గంటల్లోనే ఫలితాలు

ఎన్నికల నిర్వహణ కోసం దేశవ్యాప్తంగా 10,963 పోలింగ్ కేంద్రాల్లో 23,112 బూత్‌లను ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3.41 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇందులో కేవలం ఎన్నికల కోసం నియమించిన 1.49 లక్షల మంది తాత్కాలిక పోలీసులు కూడా ఉన్నారు. కాగా ఓట్ల లెక్కింపు ప్రారంభమైన 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. నేపాల్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై భారత్ కూడా ఆసక్తిగా ఉంది.

నా బాధ్యత తీరింది: తాత్కాలిక ప్రధాని సుశీలా కార్కీ

నేపాల్ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీలా కార్కీ ఖాట్మండులోని ధపాసి పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "నా బాధ్యత పూర్తయింది" అని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, గతేడాది సెప్టెంబర్ 12న ఆమె దేశ కార్యనిర్వాహక బాధ్యతలు చేపట్టారు. ఆరు నెలల తాత్కాలిక పాలన తర్వాత మళ్లీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం కొలువుదీరడానికి ఈ ఎన్నికలు మార్గం సుగమం చేయనున్నాయి.

నేపాల్‌లో ముగిసిన పోలింగ్.. ప్రధాని పీఠం ఎవరిదో? - Tholi Paluku