
నేపాల్‌లో ఘోరం.. బస్సు లోయలో పడి ఏడుగురు భారతీయుల దుర్మరణం
పొరుగు దేశం నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. గూర్ఖా జిల్లాలోని షాహిద్ లఖన్ రూరల్ మున్సిపాలిటీ పరిధిలో శనివారం సాయంత్రం యాత్రికులతో వెళ్తున్న ఎలక్ట్రిక్ మైక్రోబస్సు నియంత్రణ కోల్పోయి కొండపై నుంచి లోయలోకి పడిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. మరణించిన వారిలో ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు అక్కడి పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.
200 మీటర్ల లోతులోకి..
ప్రసిద్ధ 'మనకామన' ఆలయ దర్శనం ముగించుకుని తిరిగి వస్తుండగా కాంతార్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బస్సులో మొత్తం 16 మంది ఉండగా, అందులో 14 మంది భారతీయ యాత్రికులు ఉన్నారు. రహదారిపై వెళ్తున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి సుమారు 200 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏడుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మిగిలిన ఏడుగురు యాత్రికులు తీవ్ర గాయాలపాలవగా, పోలీసులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన క్షతగాత్రులు ప్రస్తుతం అంబుఖైరేనిలోని స్థానిక ఆసుపత్రితో పాటు చిత్వన్‌లోని ఓల్డ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మైక్రోబస్సు డ్రైవర్ సురక్షితంగా బయటపడగా, అతడి సహాయకుడు (క్లీనర్) గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని, అతివేగమా లేదా సాంకేతిక లోపమా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
