Let's talk: editor@tmv.in
నేను, సీఎం ఇద్దరం హైకమాండ్‌ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం: డీకే శివకుమార్‌

నేను, సీఎం ఇద్దరం హైకమాండ్‌ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం: డీకే శివకుమార్‌

Shaik Mohammad Shaffee
22 నవంబర్, 2025

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పు విషయం చర్చనీయాంశంగా మారుతున్న సమయంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక ప్రకటన చేశారు. ఐదేళ్లూ తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పారని, తామంతా ఆయనతో కలిసి పనిచేస్తామని డీకే స్పష్టం చేశారు.

2023లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. అప్పట్లో చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి పంచుకుంటారని ప్రచారం కూడా జరిగింది. తాజాగా సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం పూర్తి కావడంతో, అధికార మార్పిడిపై ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. దీనికి తోడు, డీకే శివకుమార్ వర్గానికి చెందిన 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం కావడం ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. డీకేకు అవకాశం ఇవ్వాలని ఆయన మద్దతుదారులు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి.

డీకే శివకుమార్ క్లారిటీ

ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్పష్టత ఇచ్చారు. “ఐదేళ్లూ తానే సీఎంగా కొనసాగుతానని సిద్ధరామయ్య చెప్పారు. ఆయనకు నా శుభాకాంక్షలు. మేమంతా ఆయనతో కలిసి పని చేస్తాం” అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "గ్రూపులు కట్టడం నా రక్తంలోనే లేదు. మొత్తం 140 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ నా వాళ్లే" అని డీకే తేల్చిచెప్పారు.

ఎమ్మెల్యేలు ఖర్గేను, ముఖ్యమంత్రిని కలవడం సహజమేనని, ఎందుకంటే త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగాలని సీఎం నిర్ణయించారు. మంత్రి పదవి లేదా ఇతర బాధ్యతల కోసం ఆశించడం వారి హక్కు అని, ఇందులో కొత్తదనం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం అయినా, తాను అయినా హైకమాండ్ (పార్టీ అధిష్ఠానం) ఆదేశాలకు కట్టుబడి ఉంటామని డీకే పునరుద్ఘాటించారు.

సీఎం సిద్ధరామయ్య స్పందన

ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఈ ప్రచారానికి సంబంధించి స్పందించారు. "క్యాబినెట్ విస్తరణ అంతా హైకమాండ్ నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నేను, డీకే, అందరూ అధిష్ఠానం చెప్పేది వినాలి" అని ఆయన అన్నారు. అలాగే తదుపరి బడ్జెట్‌ను తానే ప్రవేశపెడతానని స్పష్టం చేస్తూ, ఐదేళ్ల పదవీకాలంపై పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.

అంతకుముందు నాయకత్వ మార్పుపై పదేపదే జరుగుతున్న ప్రచారం వల్ల రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటోందని సీఎం సిద్ధరామయ్య, ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఫోన్ చేసి వివరించారు. ఈ అంశానికి త్వరలోనే తెరదించుతానని ఖర్గే హామీ ఇచ్చారు.

బీజేపీ దుష్ప్రచారం: ఏఐసీసీ వివరణ

సీఎం మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రణ్‌దీప్ సుర్జేవాలా కూడా తోసిపుచ్చారు. ఇది కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న దుష్ప్రచారం అని ఆయన ఆరోపించారు. పార్టీకి చెందిన వారెవరూ నాయకత్వ మార్పు గురించి బహిరంగ ప్రకటనలు చేయవద్దని ఆయన హెచ్చరించారు.

నేను, సీఎం ఇద్దరం హైకమాండ్‌ ఆదేశాలకు కట్టుబడి ఉంటాం: డీకే శివకుమార్‌ - Tholi Paluku