
నేను నిర్దోషిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బంధించిన ఘటన అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. డ్రగ్ అక్రమ రవాణా కేసుల్లో నిందితుడిగా ఉన్న మదురోను న్యూయార్క్‌లోని మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అమెరికా బలవంతంగా అపహరించిందని, తాను నిర్దోషినని పేర్కొన్నారు. తనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు.
ఏం జరిగింది?
జనవరి 3, 2026 శనివారం తెల్లవారుజామున అమెరికాకు చెందిన 'డెల్టా ఫోర్స్' కమెండోలు వెనిజులా రాజధాని కారకాస్‌పై మెరుపు దాడి చేశారు. ఈ 'ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్' ద్వారా అధ్యక్షుడు నికోలస్ మదురో (63), ఆయన సతీమణి సీలియా ఫ్లోరెస్ లను బంధించి విమానంలో న్యూయార్క్‌కు తరలించారు. సోమవారం మదురోను న్యూయార్క్‌లోని మన్హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచారు.
కోర్టులో మదురో వాదన
“నేను నిరపరాధిని. నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను ఇంకా నా దేశ అధ్యక్షుడినే” అని మదురో వ్యాఖ్యానించారు. అయితే ఈ మాటలు పూర్తి కాకముందే యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి ఆల్విన్ హెల్లర్‌స్టీన్ ఆయనను ఆపేశారు. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా తనపై ఉన్న ఆరోపణలకు నిర్దోషినని వాదించారు. తదుపరి విచారణను మార్చి 17కు వాయిదా వేశారు.
కోర్టు వెలుపల మదురోకు అనుకూలంగా, వ్యతిరేకంగా ఉన్న నిరసనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. కోర్టులో మదురో కాళ్లకు గొలుసులతో, జైలు దుస్తుల్లో నిలబడి విచారణకు హాజరయ్యారు. హెడ్‌ఫోన్ల ద్వారా అనువాదాన్ని వింటూ ఆరోపణలు విన్న మదురో, తనను అపహరించారని మరోసారి పేర్కొన్నారు.
మదురోపై ఉన్న ప్రధాన ఆరోపణలు
అమెరికా అభియోగాల ప్రకారం, మడూరో అంతర్జాతీయ డ్రగ్ కార్టెళ్లతో కలిసి కోకైన్ అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నడిపించారని ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై నార్కో-టెర్రరిజం, కోకైన్ దిగుమతి కుట్ర, మెషిన్ గన్స్, ప్రమాదకర ఆయుధాల కలిగి ఉండటం వంటి నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ వెనిజులాలోని చమురు సంపదపై అమెరికా కన్నేసినందుకే సృష్టించిన ఆరోపణలని మడూరో ఎప్పటినుంచో చెబుతున్నారు.
వెనిజులాలో ప్రస్తుత పరిస్థితి
మదురో అరెస్టు తర్వాత వెనిజులాలో పరిస్థితులు వేగంగా మారాయి. కారకాస్‌లో ఆయన ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె మడూరోకు మద్దతు ప్రకటించినప్పటికీ, అమెరికా చర్యలకు వ్యతిరేకంగా బహిరంగ పోరాటానికి దిగుతామని మాత్రం చెప్పలేదు. అమెరికా గూఢచార నివేదికల ప్రకారం, మదురో లేని పరిస్థితుల్లో దేశాన్ని తాత్కాలికంగా నడిపించగలిగే సామర్థ్యం డెల్సీ రోడ్రిగ్జ్‌కే ఉందని అంచనా వేసినట్టు సమాచారం. ప్రతిపక్ష నేతలు అధికారాన్ని చేపట్టే పరిస్థితి ఇప్పట్లో లేదని కూడా ఆ నివేదికల్లో పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ, తమది వెనిజులాతో యుద్ధం కాదని, డ్రగ్ అక్రమ రవాణా చేసే వారితో మాత్రమే పోరాటమని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని, ముందుగా దేశాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే అంతర్జాతీయ న్యాయ నిపుణులు మాత్రం ఒక దేశాధ్యక్షుడిని ఈ విధంగా అరెస్టు చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలను రష్యా, చైనా సహా వెనిజులా మిత్రదేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కూడా చర్చ జరిగింది.
మరోవైపు, వెనిజులాలోని చమురు నిల్వలపై అమెరికా తన ఆసక్తిని బహిరంగంగానే ప్రదర్శిస్తోంది. అమెరికాకు చెందిన చమురు కంపెనీలు తిరిగి వెనిజులాకు వెళ్లి, అక్కడ దెబ్బతిన్న వ్యవస్థలను పునర్నిర్మిస్తాయని ట్రంప్ ప్రకటించారు. ఇందుకోసం అవసరమైతే అమెరికా ప్రభుత్వమే డబ్బు సహాయం కూడా చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. అయితే అమెరికా నేరుగా వెనిజులా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపై ఆ దేశ స్వయం ప్రతిపత్తి, భవిష్యత్ పాలనపై ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
