
నేను కార్గహర్ ఓటరునే: ప్రశాంత్ కిశోర్
ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కు రెండు రాష్ట్రాల్లో రెండు ఓట్లు ఉన్నాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తాను 2019 నుంచే బీహార్‌లోని కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటరునని స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఉంటున్నప్పుడు తాను కొంతకాలం ఓటరు ఐడి కార్డును పొందినప్పటికీ, 2021 నుంచి తన క్రియాశీల రిజిస్ట్రేషన్ కార్గహర్‌లోనే ఉందని ఆయన తెలిపారు. ఎలక్షన్ కమిషనే నాకు ఓటరు కార్డు ఇచ్చింది కదా అని ప్రశ్నించారు. మరి బీహార్ లో ఓటర్ సమగ్ర జాబితా సవరణ చేసి వారే ఇక్కడి ఓటరని నిర్ధారించారు కదా అని గుర్తు చేశారు. బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో డబుల్ ఓటు నమోదుపై ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల సంఘం సోమవారం ఉదయం నోటీసు జారీ చేసింది. బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో రెండుచోట్ల పేరును నమోదు చేసుకున్నారన్న ఆరోపణలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
నా పేరు రెండుచోట్ల ఉన్నట్లయితే ఎన్నికల కమిషన్ ప్రత్యేక జాబితా సవరణ (సర్) ఎందుకు నిర్వహిస్తోంది? ఈ నోటీసుతో నాకు సంబంధం లేదన్నారు. కమిషన్ జారీ చేసిన నోటీసులో మీ పేరు బీహార్‌లోని కార్గహర్ నియోజకవర్గంతోపాటు పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్ నియోజకవర్గం ఓటరు జాబితాలోనూ ఉన్నట్లు పత్రికా నివేదికలు సూచిస్తున్నాయి అని తెలిపింది. ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. ఇటీవలి కాలంలో ఎన్నికల కమిషన్ నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి.
