

నేతన్నల సంక్షేమమే లక్ష్యం.. సిరిసిల్లకు ప్రభుత్వం భరోసా
సిరిసిల్ల నేతన్నల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధి, వస్త్ర పరిశ్రమకు ఊతమివ్వడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా ఇంచార్జి మంత్రి, మార్కెటింగ్, వ్యవసాయ, చేనేత జౌళి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. నేతన్నల కష్టానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, వారికి ఏడాది పొడవునా ఉపాధి కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు ప్రాంతంలో రూ.3 కోట్ల 22 లక్షల వ్యయంతో చేపట్టనున్న జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ, మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన కార్యక్రమంలో వస్త్ర పరిశ్రమ కార్మికులకు త్రిఫ్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్డీ పాస్‌బుక్‌లను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నేతన్నల సంక్షేమం, చేనేత రంగ అభివృద్ధిపై పలువురు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ చర్యలను వివరించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక అని, ఇక్కడి నేతన్నల కష్టం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. గత రెండేళ్లలోనే చేనేత రంగానికి రూ.1,360 కోట్లకు పైగా ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పించడంతో పాటు వారి సామాజిక భద్రత, బీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు.
చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం అధిక ధర చెల్లించాల్సి వచ్చినా నాణ్యమైన చీరలనే కొనుగోలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. యార్న్ డిపో ఏర్పాటుతో చేనేత సహకార సంఘాలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. నేతన్నల సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, ముఖ్యంగా చేనేత కార్మికుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.
రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, సిరిసిల్లలో తయారవుతున్న ఇందిరా మహిళా శక్తి చీరలు నాణ్యత పరంగా మంచి గుర్తింపు పొందాయని అన్నారు. ప్రభుత్వం నిరంతరం నేతన్నలకు పని కల్పిస్తూ మహిళలకు నాణ్యమైన చీరలను అందుబాటు ధరలో అందిస్తోందన్నారు. సిరిసిల్లకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే మోడల్ చీరను రూపొందించి దానికి జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలని ఆయన సూచించారు. నేతన్నల అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024–25 సంవత్సరానికి 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చి వేలాది మంది నేతన్నలకు సుమారు ఎనిమిది నెలలపాటు ఉపాధి కల్పించామని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే మూడు కోట్ల మీటర్ల చీరల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని, అందులో దాదాపు కోటి మీటర్ల చీరల ఉత్పత్తి పూర్తయిందని వెల్లడించారు. అవసరమైతే మరో మూడు కోట్ల మీటర్లకు పైగా చీరల తయారీకి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంటూ నేతన్నలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికే రూ.62 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వెల్లడించారు.
నేతన్నల అభ్యున్నతికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందని ఆది శ్రీనివాస్ తెలిపారు. 25 హెచ్‌పీ పవర్‌లూమ్‌లకు యూనిట్‌కు రూ.2 విద్యుత్ సబ్సిడీ అమలు చేయడం ద్వారా పరిశ్రమకు ఊతమిచ్చిందన్నారు. రూ.50 కోట్లతో వేములవాడలో యార్న్ బ్యాంక్ ఏర్పాటు చేశామని, కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం కూడా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్ సర్కిల్ వద్ద రూ.3 కోట్ల వ్యయంతో వస్త్ర తయారీ దశలను ప్రతిబింబించే ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రగుడు బైపాస్ జంక్షన్ సుందరీకరణను నేతన్నల వృత్తిని గుర్తు చేసే విధంగా తీర్చిదిద్దుతున్నామని, వారి కృషికి గౌరవ సూచకంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, వేములవాడకు వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు గుడి చెరువు బండ్ పార్క్‌ను అభివృద్ధి చేసి ప్రారంభించామని తెలిపారు. రగుడు బైపాస్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ, భద్రతా చర్యలు, సుందరీకరణ పనులతో పాటు వస్త్ర తయారీ ప్రక్రియను తెలియజేసే విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
గత ఏడాది జిల్లాలో తయారైన ఇందిరా మహిళా శక్తి చీరలు నాణ్యతతో మంచి ఆదరణ పొందాయని, మహిళలు పండుగలు, శుభకార్యాల్లో వాటిని ధరిస్తున్నారని తెలిపారు. ఈ నాణ్యతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మరోసారి చీరల తయారీకి ఆర్డర్లు ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
