
నేతన్నలకు ఏప్రిల్ ఒకటి నుండి ఉచిత విద్యుత్ పథకం అమలు
రాష్ట్రంలోని నేతన్నలకు ఎన్నికల్లో ఇచ్చిన మరో కీలక హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని, ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నామని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు . ఈ పథకం కింద చేనేత మగ్గాలకు ప్రతి నెలా 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందజేయనున్నారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,03,534 కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుతుందని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ఆర్థిక లబ్ధి, ప్రభుత్వ భారం
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఈ పథకం అమలులో భాగంగా ఏడాదికి రూ.85 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాపై భారం పడనున్నట్లు తెలిపారు. గత ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన మాటకు కట్టుబడుతూ, కూటమి ప్రభుత్వం ఈ హామీలను నెరవేర్చుతోందన్నారు.
దీనిలో భాగంగా నేతన్నలకు ఇచ్చిన కీలక హామీ ఉచిత విద్యుత్ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ పథకం అమలు చేయనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ పథకం ద్వారా మగ్గం కలిగిన నేతన్నలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న చేనేతలకు 500 యూనిట్లు ఉచితంగా అందజేయనున్నామన్నారు. మగ్గం కలిగిన 93 వేల కుటుంబాలు, మర మగ్గాలు వాడుతున్న 10,534 కుటుంబాలు మొత్తం 1,03,534 కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకంతో లబ్ది కలుగనుందన్నారు
ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు గణనీయమైన ఆర్థిక వెసులుబాటు కలగనుంది. చేనేత మగ్గం వాడే కుటుంబానికి నెలకు రూ.720 (ఏడాదికి రూ.8,640) ఆదా అవుతుండగా, మరమగ్గాల వారికి నెలకు రూ.1,800 (ఏడాదికి రూ.21,600) వరకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.
పెన్షన్ల పెంపు - భరోసా
నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన నేతన్నలకు ఇచ్చే పెన్షన్‌ను రూ.3,000 నుంచి రూ.4,000లకు పెంచిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 87,280 మంది నేతన్నలు ఈ పెన్షన్ పొందుతున్నారు. దీనివల్ల ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి అదనంగా రూ.12,000 ఆర్థిక లబ్ధి కలుగుతోందని అన్నారు. అలాగే, గత బకాయిల కింద ఆప్కో ద్వారా చేనేత సంఘాలకు రూ.7 కోట్లు, త్రిఫ్ట్ ఫండ్ కింద రూ.1.67 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
క్లస్టర్లు, టెక్స్‌టైల్ పార్కుల ఏర్పాటు
రాష్ట్రంలో చేనేత రంగాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసేందుకు భారీ ప్రాజెక్టులను చేపట్టామన్నారు. ధర్మవరంలో రూ.30 కోట్లతో మెగా క్లస్టర్, పిఠాపురంలో మరో మెగా క్లస్టర్ నిర్మాణానికి చర్యలు చేపట్టామనీ మంత్రి వివరించారు.
ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలో టెక్స్‌టైల్ పార్కులను, మంగళగిరిలో మెగా టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే విశాఖపట్నంలో రూ.172 కోట్లతో 5 ఎకరాల్లో అత్యాధునిక యూనిటీ మాల్‌ను నిర్మిస్తున్నామని మంత్రి సవిత అన్నారు.
నేతన్నలకు ఏడాదంతా పని కల్పించేలా ప్రభుత్వం టాటా తనేరియా, బిర్లా ఆద్యం, కో ఆప్టెక్స్ వంటి దిగ్గజ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని తెలిపారు. ఆప్కో ద్వారా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై చేనేత వస్త్రాల విక్రయాలు పెంచడంతో పాటు, నూలుపై 15% రాయితీని కూడా కొనసాగిస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో లభించిన అవార్డులే ఏపీ చేనేత రంగానికి ఉన్న ఆదరణకు నిదర్శనమని మంత్రి సవిత పేర్కొన్నారు.
