Let's talk: editor@tmv.in
నేడే బంగ్లా తీర్పు.. ప్రధాని పీఠం ఎవరిదో?

నేడే బంగ్లా తీర్పు.. ప్రధాని పీఠం ఎవరిదో?

Shaik Mohammad Shaffee
13 ఫిబ్రవరి, 2026

బంగ్లాదేశ్ రాజకీయ భవితవ్యాన్ని తేల్చే 13వ జాతీయ పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నేడు (శుక్రవారం) వెలువడనున్నాయి. గురువారం ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగగా, మొత్తం 299 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఒక నియోజకవర్గంలో అభ్యర్థి మరణించడంతో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. పోలింగ్ ముగిసిన వెంటనే ప్రారంభమైన ఓట్ల లెక్కింపు రాత్రంతా కొనసాగింది.

తాజా ట్రెండ్స్ ప్రకారం నేడు మధ్యాహ్నానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడి, దేశ పగ్గాలు ఎవరు చేపట్టబోతున్నారనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఈ ఫలితాల కోసం ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఓటు హక్కు వినియోగించుకున్న యూనస్

మధ్యంతర ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్ రాజధాని ఢాకాలోని గుల్షన్ మోడల్ స్కూల్ సెంటర్‌లో తన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజును 'కొత్త బంగ్లాదేశ్ పుట్టినరోజు'గా అభివర్ణించారు. పాత పీడకలల వంటి రోజులను ప్రజలు పక్కన పెట్టారని, నేటి నుంచి కొత్త దేశ నిర్మాణానికి పునాది పడిందని సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్నికైన ప్రభుత్వానికి అధికారాన్ని బదిలీ చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.

బీఎన్‌పీ, జమాతే ఇస్లామీల మధ్య పోరు

ఈసారి ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని నిషేధించడంతో ప్రధాన పోటీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), జమాతే ఇస్లామీ పార్టీల మధ్యే నెలకొంది. బీఎన్‌పీ చైర్మన్ తారిఖ్ రెహమాన్ ఓటు వేసిన అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే తాము ఫలితాలను గౌరవిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే శాంతిభద్రతలకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు జమాతే ఇస్లామీ చీఫ్ షఫీకర్ రెహమాన్ కూడా పారదర్శకమైన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంగీకరిస్తామని స్పష్టం చేశారు.

పలు చోట్ల హింసాత్మక ఘటనలు

ఎన్నికల వేళ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖుల్నాలో జమాతే ఇస్లామీ కార్యకర్తలతో జరిగిన గొడవలో ఒక బీఎన్‌పీ నేత ప్రాణాలు కోల్పోయారు. గోపాల్‌గంజ్‌లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద బాంబు దాడి జరగడంతో 13 ఏళ్ల బాలిక సహా ముగ్గురు గాయపడ్డారు. మున్షీగంజ్‌లోనూ బాంబు పేలుళ్ల కారణంగా పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. సిల్హెట్ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ బ్యాలెట్ బాక్సులను నింపుతున్నారన్న ఆరోపణలతో బీఎన్‌పీ, జమాతే శ్రేణుల మధ్య ఘర్షణలు జరిగాయి.

రికార్డు స్థాయిలో భద్రత.. భారీగా పరిశీలకులు

దేశవ్యాప్తంగా దాదాపు 12.7 కోట్ల మంది ఓటర్లు ఉండగా, మధ్యాహ్నం 2 గంటల సమయానికి 48 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. శాంతియుత పోలింగ్ కోసం సుమారు 10 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున భద్రత కల్పించడం ఇదే మొదటిసారి. డ్రోన్లు, బాడీ కెమెరాల ద్వారా నిఘా ఉంచారు. మొత్తం 50కి పైగా రాజకీయ పార్టీల నుండి 2000 మందికి పైగా అభ్యర్థులు బరిలో నిలిచారు. 394 మంది విదేశీ ప్రతినిధులతో పాటు వేలాది మంది స్థానిక పరిశీలకులు పోలింగ్‌ను పర్యవేక్షించారు.

సంస్కరణలపై రెఫరెండం

పార్లమెంటు ఎన్నికలతో పాటు 'నేషనల్ చార్టర్ 2025' అనే పత్రంపై కూడా దేశవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) నిర్వహించారు. మధ్యంతర ప్రభుత్వం రూపొందించిన 84 పాయింట్ల సంస్కరణల ప్యాకేజీకి ప్రజల మద్దతు కోరుతూ ఈ ఓటింగ్ జరిగింది. భవిష్యత్తులో బంగ్లాదేశ్ పాలన ఏ విధంగా ఉండాలో ఈ చార్టర్ నిర్దేశిస్తుంది. కాగా, ఓట్ల లెక్కింపు వేగంగా జరుగుతుండటంతో నేడు (శుక్రవారం) మధ్యాహ్నానికి పూర్తిస్థాయి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.