Let's talk: editor@tmv.in
నేడే పీకేఎల్ ఫైనల్ షో డౌన్

నేడే పీకేఎల్ ఫైనల్ షో డౌన్

Sandhula Dinesh
31 అక్టోబర్, 2025

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. శుక్రవారం త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో దబంగ్ ఢిల్లీ, పుణెరీ పల్టన్ జట్లు తలపడనున్నాయి. సీజన్‌లో అత్యంత ఆకర్షణీయంగా రాణించిన ఈ రెండు బలమైన జట్ల మధ్య ధైర్యం, వ్యూహం, నైపుణ్యాల సమ్మేళనం ఆసక్తికరంగా సాగనుంది.

లీగ్ దశలో రెండు జట్లూ ఒకేలా ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాలు ఆక్రమించాయి. స్థిరత్వం, ప్రశాంతత, సమతుల్య ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్నాయి. కబడ్డీ అభిమానులకు ఇది ఊహించినట్లే అయినా, అద్బుతమైన ఫైనల్‌గా మారనుంది.

సీజన్ ఎనిమిది ఛాంపియన్ దబంగ్ ఢిల్లీ... క్వాలిఫైయర్ ఒకటిలో పుణెరీ పల్టన్‌ను థ్రిల్లింగ్ పోరులో మట్టికరిపించింది. సాధారణ సమయంలో 34–34తో సమంగా నిలిచిన మ్యాచ్ టై బ్రేకర్‌కు చేరుకుని 6–4తో ఢిల్లీ విజయం సాధించింది. మాజీ కెప్టెన్ జోగిందర్ నర్వాల్ శిక్షణలో, ఆషు మాలిక్ నాయకత్వంలో జట్టు సామూహిక పట్టుదల, ఒత్తిడిలో రాణించే సత్తాతో ఈ స్థాయికి చేరింది. కీలక మ్యాచ్‌లలో వారి స్థైర్యమే బలమైన ఆయుధంగా నిలిచింది.

ఢిల్లీకు ఫైనల్ మరింత భావోద్వేగంగా సాగనుంది. సొంత మైదానంలో, స్థానిక అభిమానుల మద్దతుతో మళ్లీ ట్రోఫీ అందుకోవాలన్న ఆరాటం ఉంది. ఫజల్ అట్రాచలి, సౌరభ్ నందల్, ఆషు మాలిక్‌లు రక్షణలో దృఢత్వం, దాడిలో తీక్షణత చూపించాల్సి ఉంది. సీజన్ ముగిసే సమయానికి వారి డిఫెన్స్ మరింత పెరిగింది.

పుణెరీ పల్టన్ మాత్రం ఈ సీజన్‌లో అత్యంత స్థిరమైన జట్టుగా నిలిచింది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన తర్వాత, క్వాలిఫైయర్ ఒకటిలో ఓడినా... క్వాలిఫైయర్ రెండులో తెలుగు టైటాన్స్‌పై ఆధిపత్యం చూపి మూడోసారి ఫైనల్‌కు అర్హత సాధించింది.

కెప్టెన్ అస్లాం ఇనామ్‌దార్, కోచ్ అజయ్ ఠాకూర్ నేతృత్వంలో పుణె సమతుల్యత, క్రమశిక్షణకు కొత్త ప్రమాణాలు ఏర్పరిచింది. రైడర్ల రొటేషన్, సమన్వయ రక్షణ వ్యవస్థతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టింది. అస్లాం ఇనామ్‌దార్, ఆదిత్య షిండేల యువ దాడి జోడీ ధైర్యంగా ఆడుతోంది. డిఫెండర్లు వ్యక్తిగత ప్రతిభ కంటే జట్టు కలయిక పై ఆధారపడుతున్నారు.

ఈ సీజన్‌లో రెండు జట్లు మూడుసార్లు తలపడ్డాయి. ప్రతి మ్యాచ్‌ కూడా టైబ్రేకర్‌కు చేరి నిర్ణయమైంది. ఈ చరిత్రే శుక్రవారం ఫైనల్ ఉత్కంఠను మరింత పెంచుతోంది. ఢిల్లీ ట్రోఫీని తిరిగి సొంతం చేసుకోవాలని, పుణెరీ గతేడాది ఓటమి గాయాన్ని మరచిపోవాలని పట్టుబట్టిన నేపథ్యంలో... మరో అద్భుతమైన సీజన్‌కు తగిన గ్రాండ్ ఫినాలే ఆసక్తిని రేకెత్తిస్తోంది.