Let's talk: editor@tmv.in
నేడే తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు

నేడే తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు

Gaddamidi Naveen
17 డిసెంబర్, 2025

తెలంగాణ వ్యాప్తంగా నేడు చివరి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. సోమవారంతో ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో గ్రామాల్లో ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఇప్పటికే రెండు విడతల్లో పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ), నేటి చివరి దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఈ చివరి విడతలో రాష్ట్రంలోని 182 మండలాల్లో ఉన్న మొత్తం 4,158 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఇప్పటికే 394 పంచాయతీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే 11 సర్పంచ్‌ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో, మిగిలిన 3,753 సర్పంచ్‌ పదవులకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సర్పంచ్‌ స్థానాల కోసం మొత్తం 12,640 మంది అభ్యర్థులు పోటీ పడుతుండటం విశేషం.

ఇదే విధంగా, మొత్తం 36,434 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందులో 7,916 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మరో 112 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 28,406 వార్డు స్థానాల కోసం 75,283 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. గ్రామస్థాయిలో తీవ్ర పోటీ నెలకొనడంతో పోలింగ్‌పై భారీ ఆసక్తి నెలకొంది.

నేటి ఎన్నికల్లో మొత్తం 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 26,18,061 మంది పురుష ఓటర్లు, 27,04,394 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే 146 మంది ఇతర కేటగిరీ ఓటర్లు కూడా ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్రవ్యాప్తంగా 36,483 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగనుంది. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. నేటి సాయంత్రం లోపే ఫలితాలను ప్రకటించాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు, ఇతర భద్రతా బలగాలను పెద్ద ఎత్తున మోహరించి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గ్రామస్థాయి ప్రజాస్వామ్యానికి కీలకమైన ఈ ఎన్నికల్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది.

నేడే తెలంగాణలో చివరి విడత పంచాయతీ ఎన్నికలు - Tholi Paluku