
నేడు హైదరాబాద్‌లో మెస్సీతో సీఎం ఫుట్‌బాల్ మ్యాచ్
తెలంగాణ క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో కలిసి నేడు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) లో ఆడనున్నారు.మెస్సీ శనివారం మధ్యాహ్నం 4 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నారు. ఆదివారం ఉదయం ముంబయికి బయలుదేరుతారు.
మెస్సీ తన 'ది గోట్ టూర్' లో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే.ఈ మెస్సీ మ్యాచ్‌కు ముందు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన టీమ్ స్పిరిట్ ను ప్రదర్శించారు.మెస్సీ రాక, సీఎం స్వయంగా మ్యాచ్ ఆడటం రాష్ట్రంలోని క్రీడాభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.ఈ స్నేహపూర్వక మ్యాచ్‌ను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయి భద్రతా ఏర్పాట్లు చేసింది.ఈ స్నేహపూర్వక మ్యాచ్‌లో ముఖ్యమంత్రి సింగరేణి జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు, కాగా మెస్సీ అపర్ణ జట్టు తరఫున ఆడనున్నారు.ఈ మ్యాచ్ సందర్భంగా, పిల్లల కోసం మెస్సీ ప్రత్యేకంగా ఒక ఫుట్‌బాల్ ఈవెంట్‌ను కూడా నిర్వహించనున్నారు.
ఫ్రెండ్లీ మ్యాచ్ – ప్రత్యేక ఆకర్షణ
‘ది గోట్ టూర్ హైదరాబాద్’ అడ్వైజర్ పర్వతి రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ప్రధానంగా సింగరేణి ఆర్ఆర్9 అపర్ణ జట్టు మెస్సీ ఆల్ స్టార్స్ జట్ల మధ్య 15–20 నిమిషాల స్నేహపూర్వక మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ ప్రారంభానికి ఐదు నిమిషాల ముందుగా మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి మైదానంలోకి వచ్చి కలిసి బాల్ డ్రిబుల్ చేస్తారు. విజేతను నిర్ణయించడానికి ఇరుజట్లకు 3 చొప్పున పెనాల్టీ షాట్లు ఇచ్చేలా ప్లాన్ చేశారు. అదనంగా, మెస్సీ స్వయంగా ప్రత్యేక పెనాల్టీ కిక్ ప్రదర్శించనున్నారు.
మెస్సీతో ఫోటో, భారీ స్పందన
మెస్సీతో ఫోటో దిగేందుకు 60 మంది ప్రతిఒక్కరూ రూ.10 లక్షలు చెల్లించినట్లు పర్వతి తెలిపారు. ఈ ద్వారా వచ్చిన మొత్తాన్ని ‘ఫుట్‌బాల్ క్లినిక్’ కోసం వినియోగించనున్నారు. దీని ద్వారా యువ క్రీడాకారులకు మెస్సీ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్ల నుంచి నేర్చుకునే అవకాశాన్ని కల్పించనున్నారు.
ఈ ఈవెంట్‌కు ఇప్పటికే 27,000 టికెట్లు అమ్ముడయ్యాయి. మ్యాచ్ సమయానికి 39,000 సీట్లు మొత్తం నిండిపోతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మ్యాచ్ అనంతరం 25–30 నిమిషాలపాటు జరిగే ఫుట్‌బాల్ క్లినిక్‌లో మెస్సీ, రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ కలిసి 20 మంది పిల్లలకు శిక్షణ ఇస్తారు.
కట్టుదిట్టమైన భద్రత 3,000 మంది సిబ్బంది
ఈ కార్యక్రమం నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు వివరణ ఇచ్చారు. మొత్తం 3,000 మంది సిబ్బంది భద్రతా బాధ్యతలు నిర్వర్తిస్తారు. టికెట్ ఉన్నవారినే స్టేడియానికి అనుమతిస్తారు. రద్దీని నివారించేందుకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగించాల్ని సూచించారు. స్టేడియంలో టికెట్ల విక్రయం ఉండదని స్పష్టం చేశారు. మెస్సీకి ‘Z’ కేటగిరీ భద్రత కల్పించనున్నారు. ప్రేక్షకులను ఆట ప్రారంభానికి మూడు గంటల ముందే స్టేడియంలోకి అనుమతించనున్నారు.
