Let's talk: editor@tmv.in
నేడు సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా?

నేడు సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారా?

Gaddamidi Naveen
1 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణను ముమ్మరం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. తనను ఎర్రవల్లి గ్రామంలోని ఫాంహౌస్‌లో విచారించాలని కేసీఆర్ చేసిన అభ్యర్థనను సిట్ తిరస్కరించింది. అధికారిక రికార్డుల ప్రకారం ఆయన నివాసంగా నమోదైన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నివాసంలోనే విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది.

జనవరి 29న బంజారాహిల్స్ నివాసానికి జారీ చేసిన నోటీసు కేసీఆర్‌కు సక్రమంగా అందిందని సిట్ తన సమాధానంలో పేర్కొంది. ఆ నోటీసు అందుకున్న తర్వాతే కేసీఆర్ తన ప్రతినిధ్యాన్ని పంపించారని కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు సిట్ తమ సమాధానాన్ని శుక్రవారం రాత్రి కేసీఆర్ బంజారాహిల్స్ నివాస గోడపై అతికించింది.

క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ) సెక్షన్ 160 ప్రకారం, కేసుకు సంబంధించిన విషయాలు తెలిసిన వ్యక్తులను సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా దానికి అనుబంధ ప్రాంతాల పరిధిలో విచారణకు పిలవవచ్చని సిట్ గుర్తుచేసింది. కేసీఆర్ వయసును దృష్టిలో పెట్టుకొని, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా, విచారణను ఆయన నివాసంలోనే నిర్వహించేందుకు స్వచ్ఛందంగా అవకాశం కల్పించామని తెలిపింది.

అయితే అధికారిక రికార్డుల్లో నివాసంగా లేని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో విచారణ జరపాలన్న అభ్యర్థనను అంగీకరించలేమని సిట్ స్పష్టం చేసింది. విచారణ వేదిక అనేది అధికారికంగా నమోదైన సాధారణ నివాసాన్ని ఆధారంగా నిర్ణయించాల్సి ఉంటుందని పేర్కొంది. అదేవిధంగా, విచారణకు అవసరమైన అనేక సున్నితమైన ఎలక్ట్రానిక్, భౌతిక ఆధారాలను ఎర్రవల్లి గ్రామానికి తరలించడం పరిపాలనా పరంగా కష్టమని కూడా సిట్ తన సమాధానంలో పేర్కొంది.

ఈ నేపథ్యంలో, ఫిబ్రవరి 1న‌ మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో విచారణకు అందుబాటులో ఉండాలని కేసీఆర్‌ను సిట్ ఆదేశించింది. వాస్తవానికి జనవరి 30న విచారణకు హాజరుకావాలని సిట్ ముందుగా సూచించినప్పటికీ, మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో బిజీగా ఉన్నానని పేర్కొంటూ కేసీఆర్ మరో తేదీ ఇవ్వాలని కోరారు.

రాజకీయ దుమారం - ప్రతీకార రాజకీయాలా?

మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి? అంటూ ప్రశ్నించారు. స్వయంగా కేసీఆర్ రే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం అన్నారు. ఇది అహంకారం కాకపోతే మరేమిటి? అని అడిగారు. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీ చేతిలో కీలు బొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా? అని కేటీఆర్ మండిపడ్డారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఈ ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ కేసులో ఎలాంటి రాజకీయ ప్రతీకారం లేదని పేర్కొన్నారు.

ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ జనవరి 23న, మాజీ మంత్రి హరీష్ రావు జనవరి 20న సిట్ ఎదుట హాజరై విచారణకు లోనయ్యారు. అంతేకాకుండా మరికొందరు బీఆర్ఎస్ నేతలను కూడా ఇటీవల సిట్ ప్రశ్నించింది.

కేసు నేపథ్యం, ఇప్పటివరకు జరిగిన పురోగతి

ఈ కేసు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయవ్యవస్థకు చెందిన వ్యక్తులు సహా పలువురు ప్రముఖుల ఫోన్లను అక్రమంగా నిఘా పెట్టినట్లు వచ్చిన ఆరోపణలకు సంబంధించినది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావును ఇప్పటికే సిట్ విచారించింది.

మార్చి 2024 నుంచి హైదరాబాద్ పోలీసులు ఈ కేసులో భాగంగా తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన సస్పెండ్ అయిన డీఎస్పీ సహా నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. వారు ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి ఇంటెలిజెన్స్ సమాచారాన్ని తొలగించినట్లు, అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వీరికి తర్వాత బెయిల్ మంజూరైంది.

ఫిబ్రవరి 1న జరిగే ఈ విచారణలో కేసీఆర్ ఇచ్చే సమాధానాలు ఈ కేసులో కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగానే నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారా? అనే కోణంలో సిట్ తన ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.