Let's talk: editor@tmv.in
నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

Pinjari Chand
3 మార్చి, 2026

నేడు ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కరణం కానుంది. ప్రకృతి వీక్షకులకు విశేషమైన రోజుగా నిలవనుంది. మార్చి 3న(నేడు) దేశవ్యాప్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుందని ఇండియా మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) ప్రకటించింది. సూర్యుడు–భూమి–చంద్రుడు ఒకే సరళరేఖ(కక్ష్య)లోకి వచ్చినప్పుడు భూమి నీడలో చంద్రుడు పూర్తిగా మునిగిపోవడం వల్ల ఈ ఖగోళ విశేషం చోటుచేసుకుంటుంది. ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ గ్రహణం గాఢత (మాగ్నిట్యూడ్) 1.155గా నమోదవుతుంది. అంటే చంద్రుడు పూర్తిగా భూమి ఉంబ్రల్(గాఢమైన) నీడలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడి కొంత భాగం మాత్రమే నీడలోకి వెళితే అది పాక్షిక గ్రహణంగా పరిగణిస్తారు. ఈసారి మాత్రం సంపూర్ణ దశ స్పష్టంగా కనిపించనుంది.

దేశవ్యాప్తంగా వీక్షణం

భారతదేశం మొత్తం ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా ఖండాల్లోనూ ఇది దర్శనమిస్తుంది. అయితే దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో చంద్రోదయం సమయానికే గ్రహణం చివరి దశ కనిపించనుంది. ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్–నికోబార్ దీవుల్లో మాత్రం సంపూర్ణ దశ ముగింపు కూడా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది.

సమయాలు (భారత కాలమానం ప్రకారం)

• గ్రహణం ప్రారంభం: మధ్యాహ్నం 3.20 గంటలకు

• సంపూర్ణ దశ ప్రారంభం: సాయంత్రం 4.34 గంటలకు

• సంపూర్ణ దశ ముగింపు: సాయంత్రం 5.33 గంటలకు

• గ్రహణం ముగింపు: సాయంత్రం 6.48 గంటలకు

సంపూర్ణ దశలో చంద్రుడు ఎర్రటి వర్ణంలో కనిపించే అవకాశం ఉంది. దీనిని సాధారణంగా ‘బ్లడ్ మూన్’గా పిలుస్తారు. చంద్రగ్రహణాన్ని ప్రత్యేక రక్షణ కళ్లజోడు అవసరం లేకుండానే వీక్షించవచ్చని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఆకాశంలో అరుదుగా కనిపించే ఈ సహజ దృశ్యాన్ని ప్రజలు ఆసక్తిగా వీక్షించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

నేడు సంపూర్ణ చంద్రగ్రహణం - Tholi Paluku