Let's talk: editor@tmv.in
నేడు వైట్ హౌస్‌లో ట్రంప్-మామ్దానీ కీలక భేటీ

నేడు వైట్ హౌస్‌లో ట్రంప్-మామ్దానీ కీలక భేటీ

Shaik Mohammad Shaffee
21 నవంబర్, 2025

న్యూయార్క్ నగర మేయర్‌గా ఇటీవల చారిత్రాత్మక విజయం సాధించిన జోహ్రాన్ మామ్దానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవబోతున్నారు. ఇద్దరూ ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశం గురించి అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా వెల్లడించారు.

ట్రంప్ తన పోస్ట్‌లో "న్యూయార్క్ నగర కమ్యూనిస్ట్ మేయర్ జోహ్రాన్ క్వామే మామ్దానీ సమావేశం కావాలని కోరారు. ఈ సమావేశం నవంబర్ 21, శుక్రవారం రోజున ఓవల్ కార్యాలయంలో (అధ్యక్షుడి ప్రధాన కార్యాలయం) జరుగుతుంది. మరిన్ని వివరాలు తరువాత వెల్లడిస్తాము" అని పేర్కొన్నారు.

గెలుపు తర్వాత మాటల యుద్ధం

ఈ భేటీకి ముందు ట్రంప్, మామ్దానీల మధ్య మాటల యుద్ధం జరిగింది. మేయర్ ఎన్నికలకు ముందు ట్రంప్, మామ్దానీని "కమ్యూనిస్ట్" అని విమర్శించారు. ఒకవేళ మామ్దానీ గెలిస్తే న్యూయార్క్ నగరానికి "ఆర్థిక, సామాజిక విపత్తు" తప్పదని బెదిరించారు. అంతేకాకుండా నగరానికి ఫెడరల్ నిధులను తగ్గిస్తానని, మామ్దానీని దేశం నుంచి బహిష్కరిస్తానని కూడా హెచ్చరించారు.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత మామ్దానీ తన విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్‌కు గట్టిగా జవాబిచ్చారు. ట్రంప్ అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. "న్యూయార్క్ నగరం వలసదారులతోనే అభివృద్ధి చెందుతోంది. ట్రంప్‌కు జన్మనిచ్చిన, ఆయన ఎదుగుదలకు కారణమైన ఈ నగరమే.. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ట్రంప్ పతనానికి కూడా నాంది పలుకుతుంది" అని పేర్కొన్నారు.

ఎన్నికల సమయంలో ఒకరినొకరు ఇంతగా విమర్శించుకున్న నేతలు, ఇప్పుడు అత్యంత కీలకమైన ఓవల్ ఆఫీస్‌లో కలుస్తుండటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఎన్నికలయ్యాక, ప్రజా సమస్యలపై మమ్దానీతో కలిసి పనిచేయాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. న్యూయార్క్ వాసులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే తమ బృందం వైట్ హౌస్‌ను సంప్రదించిందని మామ్దానీ గతంలో వెల్లడించారు. నేడు జరగబోయే ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయో, ఇద్దరు నేతల మధ్య వాతావరణం ఎలా ఉంటుందోనని అమెరికా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

ఇక మామ్దానీ విషయానికి వస్తే, ఆయన న్యూయార్క్ సిటీ మేయర్‌గా ఎన్నికైన మొదటి దక్షిణాసియా, ముస్లిం వ్యక్తి. ఆయన ప్రముఖ చిత్ర నిర్మాత మీరా నాయర్, కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ మహమూద్ మామ్దానీల కుమారుడు. ఉగాండాలోని కంపాలాలో జన్మించిన మామ్దానీ, ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి న్యూయార్క్‌కు వచ్చారు. 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. ఇటీవల జరిగిన న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి కర్టిస్ స్లివాను, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ న్యూయార్క్ రాష్ట్ర గవర్నర్ ఆండ్రూ క్యుమోను ఓడించి గెలుపొందారు. జనవరి 1, 2026న న్యూయార్క్ నగర మేయర్‌గా మామ్దానీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నేడు వైట్ హౌస్‌లో ట్రంప్-మామ్దానీ కీలక భేటీ - Tholi Paluku