Let's talk: editor@tmv.in
నేడు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం

నేడు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం

Gaddamidi Naveen
31 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని కరవు ప్రభావిత ప్రాంతాలకు తాగు, సాగునీటి భరోసా కల్పించే మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ నేడు (సోమవారం) ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ప్రారంభించి, శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్‌వాటర్ నుంచి వెలిగొండకు కృష్ణా జలాలను విడుదల చేయనున్నారు. లక్షలాది మంది రైతులు తమ పొలాలకు కృష్ణా జలాలు చేరే రోజు కోసం ఎదురుచూస్తుండగా.. ఈ పరిణామంతో ప్రకాశం, మార్కాపురం ప్రాంతాల్లో కొత్త ఆశలు చిగురించనున్నాయి.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సీఎం చంద్రబాబు ఫీడర్‌ కెనాల్ గేట్లను ఎత్తి 10.7 టీఎంసీల నీటిని నల్లమలసాగర్‌లోకి విడుదల చేస్తారు. గత రెండేళ్లలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుపై రూ.2,400 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు పూర్తితో ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతులకు సాగునీటి భరోసా పెరగనుంది. పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని తీవ్రంగా వేధిస్తున్న ఫ్లోరైడ్ సమస్యకు కూడా వెలిగొండ ప్రాజెక్టు పరిష్కారం చూపుతుందని ప్రభుత్వం పేర్కొంది. సాగునీటితో పాటు తాగునీటి ఇబ్బందులు కూడా తొలగిపోనున్నాయని తెలిపింది. ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు వెల్లడించింది. ఫేజ్‌-1 ద్వారా 1.19 లక్షల ఎకరాలకు, ఫేజ్‌-2 పూర్తయితే 3.283 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ల‌క్ష్యం.

ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లింపులను వేగంగా చేపట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మూడు విడతల్లో 6,206 కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించగా, మరో రూ.169 కోట్ల పరిహారం ప్రకటించింది. 2019 తర్వాత 18 ఏళ్లు నిండిన వారికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది.

నిర్వాసిత మహిళలను గౌరవించేలా చీరలు, పసుపు, కుంకుమ, గాజులు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. నిర్వాసిత కుటుంబాలకు చెందిన 4,933 పశువులకు 30 రోజులపాటు పశుగ్రాసం అందించనున్నారు. అలాగే 10 వేల మందికి నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో కిట్‌లో 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో చక్కెర, లీటర్ వంటనూనె, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళాదుంపలు ఉంటాయి.

లక్షలాది మంది రైతులు, ప్రజల సమక్షంలో చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కృష్ణా జలాల రాకతో కరవు ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.