Let's talk: editor@tmv.in
నేడు విజయనగరం జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌

నేడు విజయనగరం జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌

FL - SIMHCLM
1 అక్టోబర్, 2025

రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం విజయనగరం జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. సీఎం ప‌ర్య‌ట‌న కోసం ద‌త్తిరాజేరు మండ‌లం ద‌త్తి గ్రామంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఏర్పాట్లను జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎంఎస్ఎంఈ శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్ప‌ల‌నాయుడు, జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఇతర అధికారులు పరిశీలించారు.

సీఎం చంద్రబాబు బుధవారం ఉద‌యం 11 గంట‌ల స‌మ‌యంలో ద‌త్తి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. నేరుగా ప్ర‌జావేదిక వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌సంగిస్తారు. అనంత‌రం ల‌బ్దిదారుల ఇంటికి వెళ్లి ఎన్‌టిఆర్ భ‌రోసా సామాజిక పింఛ‌న్ల‌ పంపిణీని ప్రారంభిస్తారు. ప్ర‌జ‌ల‌తో మ‌మేక‌మై వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటారు. అనంత‌రం 2.30 గంట‌లు నుంచి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించి, 4 గంట‌ల స‌మ‌యంలో తిరుగు ప్ర‌యాణం అవుతారు.

జిల్లాలో 2,75,681 మందికి పింఛ‌న్లు

జిల్లాలో ఎన్‌టిఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద అక్టోబర్ 1న‌ 2,75,681 మందికి సుమారు 116.95 కోట్ల రూపాయ‌ల‌ను పంపిణీ చేయ‌నున్నారు. పింఛ‌న్ల పంపిణీని ద‌త్తి గ్రామ స‌చివాల‌యం ప‌రిధిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు బుధ‌వారం ప్రారంభిస్తారు. దీనిలో గ‌జ‌ప‌తిన‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 39,641 మందికి రూ.16.62 కోట్లు కాగా, ద‌త్తిరాజేరు మండ‌లంలో 8,430 మందికి రూ.361.34 ల‌క్ష‌లు రూపాయ‌లను పింఛ‌న్ కింద పంపిణీ చేయ‌నున్నారు. ఈ పింఛ‌న్ల‌లో కేవ‌లం ద‌త్తి గ్రామంలోనే 706 మందికి రూ.29.34 ల‌క్ష‌లను పంపిణీ చేస్తారు. రాష్ట్ర‌వ్యాప్తంగా సుమారు 63,50,764 మందికి రూ.2,745.05 కోట్లను ఎన్‌టిఆర్ భ‌రోసా పింఛ‌న్ల‌ను అందజేయనున్నారు.

నేడు విజయనగరం జిల్లాలో సీఎం ప‌ర్య‌ట‌న‌ - Tholi Paluku