Let's talk: editor@tmv.in
నేడు రాష్ట్రవ్యాప్తంగా నులి పురుగు నివారణ మాత్రల పంపిణీ

నేడు రాష్ట్రవ్యాప్తంగా నులి పురుగు నివారణ మాత్రల పంపిణీ

Gaddamidi Naveen
13 జులై, 2026

పిల్లల్లో నులిపురుగుల సమస్యను నివారించేందుకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆల్బండజోల్ మాత్రల పంపిణీ చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించనున్నారు. విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు అందించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకే రోజు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. జూలై 13న మాత్ర తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న మాప్-అప్ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా మందు అందించాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

పిల్లల్లో నులిపురుగులు ఉండటం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఈ కారణంగా చదువుపై ఏకాగ్రత తగ్గే ప్రమాదం ఉందన్నారు. అందువల్ల 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సున్న ప్రతి చిన్నారికి ఆల్బండజోల్ మాత్ర వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ, ఆల్బండజోల్ ద్వారా నులిపురుగులను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు. పాఠశాలకు వెళ్లని పిల్లలను ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది గుర్తించి సమీప కేంద్రాలకు తీసుకువచ్చి మాత్ర వేయిస్తారని చెప్పారు. ఖాళీ కడుపుతో మాత్ర వేయించకూడదని, నిపుణుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఇవ్వాలని సూచించారు. 1–2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్ర, 2–3 సంవత్సరాల పిల్లలకు ఒక మాత్ర నీళ్లలో కలిపి ఇవ్వాలి. 3 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఒక మాత్రను బాగా నమిలి మింగాలని అధికారులు తెలిపారు.

ట్యాగ్‌లు
AlbendazoleDewormingDayChildHealthHealthyChildrenPublicHealthSchoolHealthNutritionForChildrenHealthAwarenessTelanganaHealth
నేడు రాష్ట్రవ్యాప్తంగా నులి పురుగు నివారణ మాత్రల పంపిణీ - Tholi Paluku