
నేడు ముంబైకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. ప్రధాని మోడీతో కీలక భేటీ
భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేసే దిశగా నేడు ఒక కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ నేడు ముంబై చేరుకోనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మధ్యాహ్నం ముంబై వేదికగా ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు. మక్రాన్ భారత పర్యటనకు రావడం ఇది నాలుగోసారి కాగా, ఆయన ఆర్థిక రాజధాని ముంబై నగరానికి రావడం ఇదే తొలిసారి.
వ్యూహాత్మక బంధంపై సమీక్ష
ఇవాళ మధ్యాహ్నం సుమారు 3:15 గంటలకు ముంబైలోని 'లోక్ భవన్'లో మోడీ, మక్రాన్ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, అంతరిక్షం వంటి రంగాలతో పాటు కొత్తగా ఎదుగుతున్న రంగాల్లో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఎలా పటిష్టం చేసుకోవాలనే అంశంపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. అంతేకాదు ప్రాంతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన వివిధ అంశాలపై కూడా ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు.
నేడే 'ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్'కి శ్రీకారం
సాయంత్రం 5:15 గంటలకు ప్రధాని మోడీ, అధ్యక్షుడు మక్రాన్ సంయుక్తంగా 'భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరం (ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్) 2026'ను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రెండు దేశాలకు చెందిన వ్యాపార దిగ్గజాలు, అంకుర సంస్థల (స్టార్టప్స్) ప్రతినిధులు, పరిశోధకులు మరియు ఆవిష్కర్తలను ఉద్దేశించి వారు ప్రసంగించనున్నారు. సాంకేతిక రంగంలో పరస్పర సహకారం, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం.
ఏఐ సమ్మిట్ కోసం మాక్రాన్ రాక
భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో పాల్గొనేందుకు మక్రాన్ ఈ పర్యటనకు వస్తున్నారు. అయితే ఈసారి ఆయన పర్యటన ఢిల్లీ కంటే ఎక్కువగా ముంబై కేంద్రంగా సాగనుంది. ముంబైలో ప్రధాని మోడీతో జరగబోయే ఈ ద్వైపాక్షిక భేటీ ముగిసిన తర్వాత, ఆయన మరో రెండు రోజుల పాటు దేశంలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య రక్షణ, ఆర్థిక మరియు సాంకేతిక బంధం మరో స్థాయికి చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
