
నేడు మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ!
ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నేడు మంత్రివర్గ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు పరిపాలనా అంశాలపై విస్తృతంగా చర్చ జరగనున్న ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాల వారిగా సమీక్ష చేయనున్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ పరిస్థితి, ప్రజాభిప్రాయం, ఎదురైన లోపాలు, విజయాలపై మంత్రుల నుంచి వివరాలు తీసుకోనున్నారు. భవిష్యత్ ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
ఈ సమావేశంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తేదీలు, సభలో చర్చించాల్సిన ప్రధాన అంశాలపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పాలన, అభివృద్ధి, ప్రజాసంబంధిత హామీల అమలుపై సభలో చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలనే అంశంపై చర్చ జరగనుంది.
అదేవిధంగా ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు అంశం కూడా కీలకంగా నిలవనుంది. దీనికి సంబంధించిన చట్టపరమైన, పరిపాలనా అంశాలపై మంత్రుల అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉంది. సొసైటీ పాలక మండళ్లకు ఎన్నికల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి.
ఇక వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌ల భర్తీపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరు, బదిలీల అంశం కూడా అజెండాలో ఉండటంతో ఈ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా మారనుంది.
