
నేడు ‘భారత్ ట్యాక్సీ’ ప్రారంభం
దేశంలోనే తొలి సహకార సంస్థల ఆధారిత రైడ్-హైలింగ్ యాప్ ‘భారత్ ట్యాక్సీ’ని కేంద్ర మంత్రి అమిత్ షా గురువారం ప్రారంభించనున్నారు. రెండు నెలల పాటు విజయవంతంగా నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ అనంతరం ఈ యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ సేవను వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, నగరాలకు విస్తరించనున్నట్లు పేర్కొంది.
‘భారత్ ట్యాక్సీ’ను మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం, 2002 కింద నమోదు చేశారు. ఈ సంస్థను జూన్ 6, 2025న స్థాపించారు. ఇది జీరో కమిషన్, సర్జ్ ఛార్జీలు లేని ధర విధానంతో పనిచేస్తుందని తెలిపింది. లాభాలను నేరుగా డ్రైవర్లకే పంపిణీ చేస్తారు. ఎనిమిది ప్రముఖ సహకార సంస్థల మద్దతుతో ప్రారంభమైన ఈ యాప్, విదేశీ పెట్టుబడుల ఆధారంగా పనిచేస్తున్న ఓలా, ఉబెర్, రాపిడో వంటి ప్లాట్‌ఫారమ్‌లకు దేశీయ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
డిసెంబర్ 2 నుంచి ఢిల్లీ-ఎన్‌సీఆర్, గుజరాత్‌లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైన ఈ సేవలో ఇప్పటివరకు మూడు లక్షలకుపైగా డ్రైవర్లు చేరగా, లక్ష మందికిపైగా వినియోగదారులు నమోదు చేసుకున్నారు. రోజుకు సగటున 10 వేల రైడ్లు పూర్తవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు డ్రైవర్లకు నేరుగా రూ.10 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. డ్రైవర్లను ‘సారథులు’గా పిలుస్తూ, వారికి ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, పదవీ విరమణ పొదుపు పథకాలు, ప్రత్యేక సపోర్ట్ సిస్టమ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం ఏడు సపోర్ట్ సెంటర్లు పనిచేస్తున్నాయి. డ్రైవర్లు ఇతర రైడ్-హైలింగ్ యాప్‌లలో కూడా పని చేయవచ్చని, ఎలాంటి ప్రత్యేక బంధనలు లేవని స్పష్టం చేశారు. మహిళా సాధికారత దిశగా ‘బైక్ దీది’ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 150 మందికిపైగా మహిళా డ్రైవర్లు ఈ యాప్‌లో చేరినట్లు తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా నుంచి 1,200 మంది సారథులు పాల్గొననున్నారు. అత్యుత్తమ సేవలందించిన ఆరుగురు సారథులను సన్మానించి, వారికి షేర్ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. వారికి రూ.5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా, రూ.5 లక్షల కుటుంబ ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు తెలిపారు. భద్రత, డిజిటల్ సేవలు, ఆపరేషన్‌ల బలోపేతం కోసం పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో తొమ్మిది అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు) కుదుర్చుకోనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా విస్తరించి, ప్రతి రాష్ట్రంలో సపోర్ట్ సెంటర్లు ఏర్పాటు చేసి, స్థిరమైన, సమగ్ర సహకార ఆధారిత మొబిలిటీ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
