
నేడు భారత్‌కు కెనడా ప్రధాని మార్క్ కార్నీ రాక
కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత పర్యటనకు రానున్నారు. నేటి నుంచి మార్చి 7 వరకు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిన పెట్టడమే లక్ష్యంగా ఈ కీలక పర్యటన సాగనుంది. కెనడా ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కార్నీ తన పర్యటనను ముంబై నుంచి ప్రారంభించనున్నారు. అక్కడ ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమై, అనంతరం న్యూఢిల్లీ చేరుకుంటారు. మార్చి 2న ప్రధాని నరేంద్ర మోడీతో కార్నీ అత్యున్నత స్థాయి చర్చలు జరపనున్నారు.
వ్యాపార, వాణిజ్య బంధాల బలోపేతం
ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య 'సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం' (సీఈపీఏ) ప్రక్రియను వేగవంతం చేయడం ప్రధాన అజెండాగా ఉంది. క్లీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, సాంకేతిక రంగాల్లో కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పడంపై ఇరువురు నేతలు దృష్టి సారించనున్నారు. భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా, వాణిజ్య, సాంకేతిక రంగాల్లో పవర్‌హౌస్‌గా ఎదుగుతోందని కెనడా ప్రధాని కార్యాలయం కొనియాడింది. 2024 నాటికి కెనడాకు భారత్ ఏడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఆ ఏడాది ఇరు దేశాల మధ్య 30.8 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది.
2030 నాటికి 50 బిలియన్ డాలర్ల లక్ష్యం
గత నవంబర్‌లో జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోడీ, మార్క్ కార్నీ భేటీ అయ్యారు. ఆ సమావేశంలోనే ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పెట్టుబడులు, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు భారత్-కెనడాల మధ్య అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోడీ ఆ సందర్భంగా పేర్కొన్నారు. పాత చేదు జ్ఞాపకాలను వీడి, నూతన భాగస్వామ్యంతో ముందుకు సాగాలన్న ఇరు దేశాల సంకల్పానికి ఈ పర్యటన ఒక మైలురాయిగా నిలవనుంది.
