Let's talk: editor@tmv.in
నేడు భారత్‌కు ఎల్పీజీ నౌక 'జగ్ విక్రమ్'

నేడు భారత్‌కు ఎల్పీజీ నౌక 'జగ్ విక్రమ్'

Shaik Mohammad Shaffee
14 ఏప్రిల్, 2026

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నడుమ దేశీయ ఇంధన అవసరాలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 20,400 మెట్రిక్ టన్నుల ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ)తో వస్తున్న భారత ఫ్లాగ్ షిప్ నౌక 'జగ్ విక్రమ్' నేడు గుజరాత్‌లోని కండ్లా ఓడరేవుకు రానుంది. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో కేంద్ర నౌకాయాన శాఖ అదనపు కార్యదర్శి ముకేష్ మంగళ్ ఈ వివరాలను వెల్లడించారు.

హోర్ముజ్ జలసంధిలో భారత నౌక యాత్ర

వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధిని జగ్ విక్రమ్ నౌక ఈ నెల 11వ తేదీన విజయవంతంగా దాటినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా-ఇరాన్ మధ్య 14 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత, ఈ కీలక సముద్ర మార్గం గుండా ప్రయాణించిన తొలి భారతీయ నౌక ఇదే కావడం విశేషం. 24 మంది భారతీయ నావికులతో కూడిన ఈ నౌక రాక.. ఉద్రిక్తతల తర్వాత సముద్ర వాణిజ్య మార్గాల పునరుద్ధరణలో భారత్‌కు దక్కిన ముందడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.

భద్రతపై భరోసా.. నావికుల సురక్షిత తరలింపు

గల్ఫ్ రీజియన్‌లో భారతీయ నౌకల భద్రతపై అదనపు కార్యదర్శి ముకేష్ మంగళ్ స్పష్టమైన భరోసా ఇచ్చారు. గత 24 గంటల్లో భారతీయ నౌకలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. "ఇప్పటివరకు గల్ఫ్ ప్రాంతం నుండి 2,177 మంది భారతీయ నావికులను ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చింది. ఇందులో గడచిన 24 గంటల్లోనే 93 మందిని స్వదేశానికి తరలించాం" అని ఆయన వివరించారు. నావికుల సంక్షేమం కోసం విదేశీ వ్యవహారాల శాఖ, ఇతర రాయబార కార్యాలయాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు.

దేశీయ గ్యాస్ అవసరాలకు కీలకం

భారతదేశానికి అవసరమయ్యే ఎల్పీజీలో దాదాపు 90 శాతం గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు సజావుగా సాగడం దేశీయ ఇంధన నిల్వలకు అత్యంత అవసరం. ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో కార్యకలాపాలు సాధారణంగానే సాగుతున్నాయని, ఎక్కడా రద్దీ గానీ, అడ్డంకులు గానీ లేవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నేడు కండ్లా తీరానికి జగ్ విక్రమ్ రాకతో గ్యాస్ సరఫరా వ్యవస్థకు మరింత భరోసా లభించనుంది.