Let's talk: editor@tmv.in
నేడు బీహార్ లో ఓట్ల లెక్కింపు

నేడు బీహార్ లో ఓట్ల లెక్కింపు

Pinjari Chand
14 నవంబర్, 2025

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు విస్తృత భద్రతా ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 38 జిల్లాల్లోని 46 కేంద్రాల్లో శుక్రవారం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ సందర్భంగా పాట్నా నగరంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 243 స్థానాలకుగాను నవంబర్‌ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్‌ నిర్వహించగా, 67.13 శాతం అనే చారిత్రాత్మకంగా అధిక ఓటింగ్‌ నమోదైంది. మొత్తం 7.45 కోట్ల మంది ఓటర్లు 2,616 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

ఎన్నికల కమిషన్‌ ప్రకారం, ప్రతి నియోజకవర్గానికి ఒక రిటర్నింగ్‌ ఆఫీసరు, ఒక కౌంటింగ్‌ అబ్జర్వర్‌, అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సమక్షంలో లెక్కింపు జరుగనుంది. ఇందుకోసం 4,372 కౌంటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌ వద్ద ఒక సూపర్వైజర్‌, ఒక అసిస్టెంట్‌, ఒక మైక్రో అబ్జర్వర్‌ విధులు నిర్వహించనున్నారు. 18,000 మందికి పైగా కౌంటింగ్‌ ఏజెంట్లు కూడా ప్రక్రియను పర్యవేక్షిస్తారు. లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపు, ఆ తరువాత 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది.

అంతరాయంలేకుండా లెక్కింపు జరిగేలా సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్స్‌ బలగాలు, బీహార్‌ పోలీసు సిబ్బంది భారీగా మోహరించారు. రాష్ట్రం వెలుపల నుంచి 106 కంపెనీల భద్రతా సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. లెక్కింపులో ఉపయోగించిన ఈవీఎంలు, విఎవీపీఏట్స్‌ యంత్రాలను డబుల్‌ లాక్‌ వ్యవస్థతో సీల్డ్‌ చేసిన స్ట్రాంగ్‌ రూముల్లో ఉంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద రెండచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు. లోపల,బయట రాష్ట్ర పోలీసులు భద్రత ఏర్పాట్లు చేశారు. అదనంగా 24 గంటల సీసీటీవీ నిఘా కూడా అమల్లో ఉందని అధికారులు తెలిపారు.

లెక్కింపు ఇలా

మొదట పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. 8.30కి ఈవీఎంల లెక్కింపు మొదలవుతుంది. తాజా ఈసీ మార్గదర్శకాల ప్రకారం, ఈవీఎం లెక్కింపులో చివరి నుంచి రెండో రౌండ్‌ మొదలయ్యే లోపు పోస్టల్‌ బ్యాలెట్‌ల లెక్కింపును పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈవీఎం లెక్కింపు సమయంలో కంట్రోల్‌ యూనిట్లు టేబుళ్లకు రౌండ్‌వారీగా తీసుకొచ్చి, వాటి సీల్స్‌, సీరియల్‌ నంబర్లను ఫారం 17సీ రికార్డులతో సరిపోల్చుతారు. ఏదైనా తేడా వస్తే ఆ పోలింగ్‌ బూత్‌కు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా లెక్కిస్తారు.

ఈవీఎం లెక్కింపు పూర్తయ్యాక ప్రతి నియోజకవర్గం నుంచి యాదృచ్ఛికంగా ఐదు పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేసి, వాటి వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎం ఫలితాలతో సరిపోల్చుతారు. ఇది అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో జరుగుతుంది.

ఫలితాలు ప్రతి రౌండ్‌ అనంతరం నియోజకవర్గాలవారీగా సంబంధిత రిటర్నింగ్‌ ఆఫీసర్లు ఈసీ అధికారిక పోర్టల్‌లో అప్‌డేట్‌ చేస్తారు. ప్రజలు, మీడియా సంస్థలు, టీవీ చానెళ్లు అధికారిక ఈసీ పోర్టల్‌లో వచ్చే సమాచారం మీదే నమ్మకం ఉంచాలని, వదంతులు లేదా నిర్ధారణ లేని వివరాలను నమ్మవద్దని ఈసీ స్పష్టంగా హెచ్చరించింది.

జూబ్లీహిల్స్ లోనూ సర్వం సిద్ధం

జూబ్లీ హిల్స్–61 అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. లెక్కింపు కేంద్రంలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో లెక్కింపు ప్రక్రియ, భద్రతా చర్యలు, ఈవీఎంలు హ్యాండ్లింగ్ వంటి అంశాలపై వివరంగా సూచనలు ఇచ్చారు. పారదర్శకంగా, సమర్థవంతంగా, శాంతియుతంగా ఓట్ల లెక్కింపు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

నేడు బీహార్ లో ఓట్ల లెక్కింపు - Tholi Paluku