Let's talk: editor@tmv.in
నేడు బీహార్ రెండో దశ ఎన్నికలు

నేడు బీహార్ రెండో దశ ఎన్నికలు

Pinjari Chand
11 నవంబర్, 2025

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో, తుది దశలో 122 స్థానాలకు నేడు (నవంబర్ 11) ఓటింగ్ జరగనుంది. మొత్తం 1,302 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఈ దశలో తేలనుంది. వీరిలో సుమారు కేబినేట్ లో సగం మంది నితీష్‌కుమార్ మంత్రివర్గ సభ్యులు పోటీలో ఉన్నారు. మొత్తం 3.70 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ దశలో ప్రధానంగా పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, సీతామఢి, మధుబని, సుపౌల్, అరారియా, కిషన్‌గంజ్ జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. ఈ జిల్లాలన్నీ నేపాల్ సరిహద్దుకు సమీపంలో ఉండటంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఇది ఎన్డీయే, మహాఘట్భంధన్ కూటముల రెండింటికీ అత్యంత కీలకమైన పోరాటంగా మారింది.

కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు

రెండో దశ ఎన్నికల సందర్భంగా 4 లక్షలకు పైగా సిబ్బందిని విధుల్లో నిమగ్నం చేశారు. మొత్తం 45,399 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అందులో 40,073 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి.

పోటీ చేయనున్న ప్రధాన అభ్యర్థులు

జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ (సుపౌల్) ఎనిమిదోసారి గెలవాలని ఉవ్విళ్లూరుతున్నారు. బీజేపీ నేత ప్రేం కుమార్ (గయా టౌన్) 1990 నుంచి వరుసగా ఏడు సార్లు గెలుస్తూ వచ్చి, ఎనిమిదోసారి బరిలో నిలిచారు. బీజేపీ మంత్రులు రేణు దేవి (బెట్టియా), నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ (ఛటాపూర్) నుంచి పోటీ చేస్తున్నారు. జేడీయూ తరపున లేషీ సింగ్, శీలా మండల్, జామా ఖాన్ తమ స్థానాల నుంచి మళ్లీ బరిలోకి దిగారు. మాజీ ఉపముఖ్యమంత్రి తార్కేశ్వర్ ప్రసాద్ (కతిహార్) ఐదోసారి ఈ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు.

ఎన్డీయే మిత్రపక్షాలు

హిందుస్తానీ అవామ్ మోర్చా (హామ్) అధినేత జితన్‌రామ్ మాంఝీ, రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్‌ఎల్‌ఎం) అధినేత ఉపేంద్ర కుశ్వాహా పార్టీలు చెరో ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. వీటిలో హామ్‌కు చెందిన ఇమామ్‌గంజ్, బరచట్టి, టికారి, సికంద్ర స్థానాలు కీలకంగా ఉన్నాయి.

రాజకీయ మార్పులు

2020లో ఆర్జేడీ టికెట్‌పై గెలిచిన సంగీత కుమారి (మోహనియా) ఇప్పుడు బీజేపీ నుంచి బరిలో ఉన్నారు. విభా దేవి (నవాడ) ఆర్జేడీ నుంచి జేడీయూలో చేరారు. కాంగ్రెస్ మాజీ మంత్రి మురారి గౌతం (చెనారి) ఇప్పుడు లోక్ జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) టికెట్‌పై పోటీలో నిలిచారు.

ఇతర ముఖ్య అభ్యర్థులు

కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు రాజేష్ కుమార్ (కుటుంబ) రిజర్వ్‌డ్ సీటు నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. జేడీయూ ఎంపీ కుమారుడు చాణక్య ప్రకాశ్ రంజన్ (బెల్హర్) ఆర్జేడీ తరపున పోటీ చేస్తున్నారు.

ఓటర్ల గణాంకాలు

• మొత్తం ఓటర్లు: 3.70 కోట్లు

• మహిళా ఓటర్లు: 1.75 కోట్లు

• 30–60 మధ్య వయస్సు ఉన్నవారు: 2.28 కోట్లు

• యువ ఓటర్లు (18–19 ఏళ్లు): 7.69 లక్షలు

• అతి పెద్ద నియోజకవర్గం: హిసువా (నవాడ జిల్లా, 3.67 లక్షల ఓటర్లు)

అత్యధిక అభ్యర్థులు ఉన్న స్థానాలు: లౌరియా, చనపాటియా, రక్సౌల్, త్రివేణిగంజ్, సుగౌలి, బన్మఖి (ప్రతి ఒక్క నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు)మొదటి దశలో జరిగిన ఓటింగ్‌లో రాష్ట్రంలో ఎప్పుడు లేని 65 శాతం కంటే ఎక్కువ పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి.

8 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు

దేశంలోని 7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 11న ఉపఎన్నికలు జరగనున్నాయి. జమ్మూ కశ్మీర్, రాజస్థాన్, ఝార్ఖండ్, తెలంగాణ, పంజాబ్, మిజోరం, ఒడిశా రాష్ట్రాల్లో ఓటింగ్‌కు ఇప్పటికే సన్నాహాలు పూర్తి అయ్యాయి. ఫలితాలు నవంబర్ 14న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు వెలువడనున్నాయి.

జమ్మూ కశ్మీర్‌లో బుద్గాం, నాగ్రోటా నియోజకవర్గాల్లో, రాజస్థాన్‌లో బరాన్ జిల్లాలోని అంతా నియోజకవర్గంలో, ఝార్ఖండ్‌లోని ఘట్షిలాలో, ఒడిశా నువాపడలో, తెలంగాణ జూబ్లీహిల్స్‌లో, పంజాబ్ తరణ్ తరణ్, మిజోరంలో డాంపా నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

నేడు బీహార్ రెండో దశ ఎన్నికలు - Tholi Paluku