
నేడు బీహార్‌లో సీఈసీ బృందం పర్యటన
బీహార్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం నేడు పాట్నాలో పర్యటించనుంది. ఈ పర్యటన సందర్భంగా నేడు, రేపు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ కీలక చర్చలు జరపనుంది. వీరితో పాటు పోలీస్, పరిపాలన, రాష్ట్ర ఎన్నికల అధికారులతో కూడా ఈసీ బృందం భేటీ కానుంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఈ బృందంలో ఎన్నికల కమిషనర్‌లు వివేక్ జోషి, ఎస్.ఎస్. సంధు ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించడానికి ముందు రాష్ట్రంలో పటిష్టమైన, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోవడం, వారి సందేహాలను నివృత్తి చేయడం ఈ సమావేశాల ముఖ్య ఉద్దేశం.
ముఖ్య నేతలతో కీలక భేటీలు
బీహార్‌లో 243 మంది సభ్యులు గల అసెంబ్లీకి నవంబర్ 22తో పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల చివరి నుంచి నవంబర్ మధ్యలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసీ బృందం రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలుత రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం కానుంది. బీజేపీ, కాంగ్రెస్, జేడీ(యూ), ఆర్జేడీ, సీపీఐ (ఎంఎల్) వంటి రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులు హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను పర్యవేక్షించడం, సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల మోహరింపుపై ఈసీ తీసుకుంటున్న చర్యలపై పార్టీలు తమ సూచనలు ఇవ్వవచ్చు. అలాగే ఎన్నికలను ఏ తేదీల్లో, ఎన్ని దశల్లో నిర్వహించాలనే దానిపై పార్టీల అభిప్రాయాలను ఈసీ తీసుకునే అవకాశం ఉంది. ప్రచార ర్యాలీలు, సభల నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఈసీ వారికి వివరించవచ్చు.
ఓటర్ల జాబితా వివాదంపై చర్చ
బీహార్‌లో ఓటర్ల జాబితాకు సంబంధించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ముగిసింది. సెప్టెంబర్ 30న ప్రచురించబడిన తుది ఓటర్ల జాబితాలో దాదాపు 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ జాబితాలో లక్షలాది మంది అర్హులైన పౌరుల పేర్లు తొలగించబడ్డాయని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. నిజమైన పౌరుల ఓట్లను తొలగించి, పరోక్షంగా అధికార కూటమికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం జరుగుతోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ బృందం ఈ సమావేశంలో ఓటర్ల జాబితాకు సంబంధించిన వివాదాలపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అర్హత ఉన్న ఒక్క ఓటరును కూడా జాబితా నుంచి తొలగించే ప్రసక్తే లేదని ఈసీ ఇప్పటికే ప్రకటించింది. అయినప్పటికీ రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఏవైనా లోపాలు ఉంటే సరిదిద్దడానికి అదనపు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈసీ బృందం పర్యటన ముగిసిన వెంటనే, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ (జేడీయూ) ఉన్నారు. ప్రతిపక్షంలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్జేడీ ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని ఇండియా కూటమి చూస్తుంటే, మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్‌డీఏ కూటమి భావిస్తోంది. బీహార్ రాష్ట్రంలో ఈసారి ఎన్‌డీఏ-ఇండియా కూటమి నేతల మధ్య పోటీ గట్టిగానే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
