
నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘చలో బస్ భవన్’
ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఇవాళ చలో బస్ భవన్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఛలో బస్ భవన్ ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సహా బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. నందినగర్ నుంచి కేటీఆర్, మెహిదీపట్నం నుంచి హరీశ్‌రావు బస్సులో ప్రయాణం చేసి బస్ భవన్‌కి చేరుకుంటారని తెలిపారు.
పెంచిన బస్సు చార్జీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణం అంటూనే వాళ్ల కుటుంబ సభ్యులపై భారం వేయడం అన్యాయమని ఆరోపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయిన వారి సంఖ్యనే ఎక్కువని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా చెప్పిందని పార్టీ వర్గాలు గుర్తు చేశాయి.
గౌలిగూడ బస్ డిపోను రూ.400కోట్లకు ప్రైవేట్ వాళ్లకి ఇచ్చారని ఆరోపించారు. మియాపూర్,ఉప్పల్‌తో సహా వివిధ డిపోలను ప్రైవేటీకరణ చేయబోతున్నారని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి కార్మికులను ముంచాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతిస్తున్నామని కానీ ఆర్టీసీ డ్రైవర్లతోనే ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
