
నేడు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో సంవిధాన దినోత్సవం
నవంబర్ 26 ను దేశ రాజ్యాంగం ఆమోదం పొందిన రోజుగా పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే సంవిధాన దినోత్సవం కార్యక్రమాలు నేడు దేశవ్యాప్తంగా ఘనంగా జరగనున్నాయి. ప్రధాన కార్యక్రమం పాత పార్లమెంట్ భవనంలోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో జరగనుంది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షత వహిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది.
1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు ఆ రోజే అమలులోకి రాగా, మిగిలినవి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చి భారతదేశం గణతంత్రంగా అవతరించింది. 2015 నుంచి కేంద్రం ఈ రోజును అధికారికంగా ‘సంవిధాన దినోత్సవం’గా నిర్వహిస్తోంది. నేటి ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరుకానున్నారు. స్పీకర్, ఉపరాష్ట్రపతి సందేశాలతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీ భాషల్లో సిద్ధం చేసిన డిజిటల్ ప్రతులను ఆవిష్కరించనున్నారు. అదే క్రమంలో అసలు రాజ్యాంగంలోని కళాత్మక క్యాలిగ్రఫీపై ప్రత్యేక పుస్తకాన్ని విడుదల చేస్తారు. అనంతరం రాష్ట్రపతి నేతృత్వంలో సభ మొత్తం రాజ్యాంగ ఉపోద్ఘాతం (ప్రీయాంబుల్) పఠనం జరుపుకుంటుంది.
దేశవ్యాప్తంగా అన్ని మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. ప్రజలు MyGov.in, Constitution75.com వేదికల ద్వారా ఆన్‌లైన్‌లో ఉపోద్ఘాతాన్ని చదవాల్సి ఉంటుంది. ‘హమారా సంవిధాన్ – హమారా స్వాభిమాన్’ పేరిట జాతీయ స్థాయి ఆన్‌లైన్ క్విజ్, బ్లాగ్, వ్యాసరచన పోటీలను కూడా కేంద్రం నిర్వహిస్తోంది. పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ వరకు సమావేశాలు, సెమినార్లు, చర్చలు, లఘు చిత్రాలు, ప్రదర్శనలు, సాంస్కృతిక ఈవెంట్లు, పోస్టర్–పెయింటింగ్, రంగోలి కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
