
నేడు నేపాల్ ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం
హిమాలయ దేశం నేపాల్ రాజకీయాల్లో నవ శకం ప్రారంభమైంది. రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్ఎస్‌పీ) యువ నేత, ప్రసిద్ధ రాపర్ బాలేంద్ర షా (35) అలియాస్ ‘బాలెన్’ నేపాల్ నూతన ప్రధానమంత్రిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నేపాల్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా, మధేశీ ప్రాంతం నుంచి ఈ అత్యున్నత పదవిని చేపడుతున్న తొలి వ్యక్తిగా బాలెన్ రికార్డు సృష్టించనున్నారు. శీతల్ నివాస్‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆయనతో ప్రమాణం చేయిస్తారు.
నిన్న ఎంపీగా.. నేడు ప్రధానిగా
ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా గురువారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతినిధుల సభలోని నూతన సభ్యులందరితో సభలో అత్యంత సీనియర్ అయిన అర్జున్ నర్సింగ్ కేసీ (78) ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో భాగంగానే బాలెన్ షా కూడా ఎంపీగా ప్రమాణం చేశారు. అనంతరం ఆర్ఎస్‌పీ పార్లమెంటరీ పార్టీ సమావేశమై బాలెన్‌ను తమ నాయకుడిగా అధికారికంగా ఎన్నుకుంది. ఈ పరిణామాల తర్వాత అధ్యక్షుడి నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు అధికారిక ఆహ్వానం అందింది.
సంప్రదాయ రాజకీయాలకు చరమగీతం
గతేడాది దేశవ్యాప్తంగా సాగిన 'జెన్ జీ' ఉద్యమం నేపాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అవినీతి రహిత పాలన, యువ నాయకత్వం కావాలంటూ యువత చేసిన పోరాటం ఫలితంగా సంప్రదాయ పార్టీలు కుప్పకూలాయి. ఈ ఎన్నికల్లో బాలెన్ షా ఏకంగా నాలుగుసార్లు ప్రధానిగా చేసిన దిగ్గజ నేత కె.పి. శర్మ ఓలీని ఆయన సొంత నియోజకవర్గం ఝాపా-5లో భారీ మెజారిటీతో ఓడించి సంచలనం సృష్టించారు. కమ్యూనిస్ట్ పార్టీ (యూఎంఎల్) వంటి పాత పార్టీల కంచుకోటలను బద్దలు కొడుతూ ఆర్ఎస్‌పీ ప్రభంజనం సృష్టించింది.
పూర్తి మెజారిటీతో కొత్త ప్రభుత్వం
మొత్తం 275 స్థానాలున్న ప్రతినిధుల సభలో ఆర్ఎస్‌పీ ఏకంగా 182 సీట్లు గెలుచుకుంది. రాజ్యాంగంలోని అధికరణ 76(1) ప్రకారం ఈ పార్టీ సొంతంగా మెజారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అర్హత సాధించింది. బాలెన్ షా నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో సుమారు 15 నుంచి 18 మంది సభ్యులు ఉండే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. నిన్నటి పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో మంత్రుల పేర్లను దాదాపు ఖరారు చేశారు. దేశంలో వ్యవస్థాగత మార్పులు కోరుకుంటున్న ప్రజలు, బాలెన్ షా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
