
నేడు దేవరపల్లి పొగాకు వేలం కేంద్రానికి వైఎస్ జగన్ పర్యటన
పొగాకు మద్దతు ధరలు పడిపోయి తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించేందుకు, వారి సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం (ఆగస్టు 5న) తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం వెల్లడించారు.
పొగాకు రైతులు ఇటీవల జగన్ మోహన్ రెడ్డిని కలిసి తమ ఆవేదనను తెలిపి, వేలం కేంద్రానికి రావాల్సిందిగా కోరిన నేపథ్యంలో ఈ పర్యటన ఖరారైందన్నారు. రాష్ట్రంలో పొగాకు ధరలు రోజురోజుకూ పడిపోతున్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.200 కంటే తక్కువ ధరకు కొనుగోలు జరగకూడదని ప్రకటించినప్పటికీ ప్రస్తుతం సగటు ధర కిలోకు రూ.186.90కే పరిమితమైందని ఆరోపించారు. వేలంలో వచ్చిన పరిమాణం, ధరలు, తిరస్కరణల వివరాలను ప్రతిరోజూ వెల్లడించాల్సిన టొబాకో బోర్డు గత పది రోజులుగా ఆ సమాచారాన్ని అప్లోడ్ చేయడం నిలిపివేయడంతో రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యలపై రైతులు ధర్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు.
ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ రైతుల సమస్యలను వాస్తవాధారాలతో ప్రజల ముందుకు తీసుకువస్తుందని నాగిరెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చేసిన సబ్సిడీ ప్రకటనలు రైతులకు ఉపయోగపడేలా లేవని అన్నారు. ప్రస్తుతం పొగాకు రైతులు కిలోకు సుమారు రూ.50 వరకు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం అత్యుత్తమ నాణ్యత పొగాకుకు రూ.250, మధ్యస్థ నాణ్యతకు రూ.190, తక్కువ నాణ్యతకు రూ.110 ధర నిర్ణయించినా, ఆచరణలో రైతులకు సరైన ధర లభించడం లేదని విమర్శించారు.
రైతులకు గిట్టుబాటు ధర రావాలంటే మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కొనుగోళ్లు చేపట్టాలని, తద్వారా పోటీ ఏర్పడి రైతులకు న్యాయమైన ధర దక్కుతుందని సూచించారు. పొగాకు, మిర్చి, మామిడి రైతుల సమస్యలపై జగన్ పర్యటనలు ప్రభుత్వాన్ని స్పందించేలా చేశాయని, దేవరపల్లి పర్యటనతో పొగాకు రైతుల సమస్యలు జాతీయ స్థాయిలో చర్చకు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
