
నేడు తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాష్ట్రంలో జరగనున్న నేడు తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన ఏర్పాట్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని వెల్లడించారు. తొలి విడతలో 395 గ్రామాల్లో, రెండో విడతలో 495 గ్రామాల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా గ్రామాల్లో పోలింగ్ నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుందని చెప్పారు. పోలింగ్ పూర్తయ్యగానే వెంటనే కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు స్పష్టంచేశారు.
ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఇప్పటి వరకు రూ. 8.2 కోట్ల నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు. శాంతి భద్రతలను కాపాడేందుకు అదనపు బలగాలను మోహరించామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై తగిన చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఓటర్లు భయంలేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, నీడ, సహాయక సిబ్బంది వంటి వసతులు సిద్ధంగా ఉంచినట్లు కమిషనర్ తెలిపారు. ప్రత్యేకించి వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామని చెప్పారు. అన్ని స్థాయిల్లో అధికారులు సమన్వయంతో పనిచేస్తుండడంతో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయని రాణికుముదిని విశ్వాసం వ్యక్తం చేశారు.
