
నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కి సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక, రాజకీయ కక్షసాధింపు చర్యలకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపట్టాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.
ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు తదితరులు సంయుక్తంగా పిలుపునిచ్చారు. కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు.
టెలిఫోన్ ట్యాపింగ్ పేరుతో కట్టుకథలు సృష్టించి, ఇప్పుడు సిట్ విచారణ పేరుతో నోటీసులు జారీ చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్యగా పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిన నాయకుడిని అవమానించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం కేసీఆర్ పై మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల గౌరవంపై దాడి అని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.
నేడు నిర్వహించే నిరసనల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000కు పైగా గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నేతలు సూచించారు.
పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ జిల్లాల్లోనే ఉండి నిరసనలను విజయవంతం చేయాలని ఆదేశించారు. నిరసనలు పూర్తిగా శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, పోలీసులతో ఘర్షణలకు తావివ్వకుండా ప్రభుత్వ కుట్రలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించింది. తెలంగాణ స్వాభిమానం కోసం పోరాటం కొనసాగుతుందని నేతలు పేర్కొన్నారు.
ఈ నిరసనల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి "నిరసన సెగ" తగిలేలా చేయాలని, కేసీఆర్ వెంటే తెలంగాణ సమాజం ఉందనే విషయాన్ని చాటిచెప్పాలని పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
