
నేడు ఢిల్లీ ‘ఏఐ’ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026'కు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచస్థాయి ఐటీ,టెక్నాలజీ దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ముఖ్యంగా యువతకు అత్యాధునిక సాంకేతికతలో శిక్షణ, ఉపాధి కల్పనే ధ్యేయంగా ఈ ఒప్పందాలు సాగనున్నాయి.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి మొదట భారతదేశ ఆర్థిక వృద్ధికి ఇంధనం' అనే ప్లీనరీ సమావేశంలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి చంద్రబాబు ప్రసంగించనున్నారు.
అనంతరం అంతర్జాతీయ దిగ్గజ సంస్థ 'ఐబీఎం సంస్థతో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. కాగా ఒప్పందం ద్వారా రాష్ట్రంలోని పది లక్షల మంది యువతకు ఏఐ, క్వాంటం టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ రంగాల్లో నైపుణ్య శిక్షణ లభించనుంది. అదేవిధంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహకారంతో రాష్ట్రంలో ప్రత్యేకంగా 'క్వాంటం ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ కంప్యూటింగ్ సెంటర్ తో కలిసి క్వాంటం ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను, చిప్ తయారీ దిగ్గజం 'ఎన్విడియా' భాగస్వామ్యంతో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ను రాష్ట్రంలో నెలకొల్పనున్నారు. విద్యార్థుల కోసం ఐఐటీ మద్రాస్ సహకారంతో ఏఐ ట్యూటర్ అనే వినూత్న కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ప్రారంభించనుంది.
ఇక మధ్యాహ్నం వేళ ముఖ్యమంత్రి వరుస అంతర్జాతీయ భేటీల్లో పాల్గొంటారు. 'కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం' అనే అంశంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సీఈఓ బోర్జ్ బ్రెండేలతో కలిసి చర్చించనున్నారు. అనంతరం బ్రిటన్ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇందులో యూకేఏ ఏఐ ఆన్‌లైన్ భద్రత మంత్రి కనిష్క నారాయణ్, హైకమిషనర్ లిండీ కామెరాన్‌లతో కలిసి ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారం పై చర్చలు జరుపుతారు.
సాయంత్రం వేళ పారిశ్రామిక దిగ్గజాలతో ముఖ్యమంత్రి విడివిడిగా సమావేశం కానున్నారు. అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, అరాంకో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రెహమాన్, ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హేలీలతో భేటీ అయి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించనున్నారు.
