
నేడు కోటి మంది మహిళలకు 'ఇందిరమ్మ చీరల' పంపిణీ ప్రారంభం
రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మంగళవారం మంత్రి సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన చీరను అందించాలని అధికారులకు సూచించారు.నేడు ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు.
రెండు దశల్లో పంపిణీ:
చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తుండగా, ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, పంపిణీని రెండు దశలుగా చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
మొదటి దశ:
గ్రామీణ ప్రాంతాలు. ఇందిరా గాంధీ జయంతి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.
రెండో దశ:
పట్టణ ప్రాంతాలు. మార్చి 1 నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు.
చీరల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడొద్దని సీఎం అధికారులు తెలిపారు. సాంకేతికాన్ని వినియోగిస్తూ పంపిణీని పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలన్నది సూచించారు. ప్రతి దశలో పంపిణీ పురోగతిని నిరంతర పర్యవేక్షణలో ఉంచాలని ఆయన ఆదేశించారు.
పంపిణీ ప్రారంభం ఇలా...
నేడు మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ముఖాముఖి మాట్లాడనున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలెక్టరేట్ల నుంచి పాల్గొనాలని ఆదేశించారు.ఈ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు సీఎం సెక్రెటరీ మాణిక్ రాజ్, హ్యాండ్లూమ్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్, సెర్ప్ సీఈవో డి.దివ్య, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని సుమారు కోటి మంది మహిళలకు నాణ్యమైన చీరలు వితరణ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ మేరకు, ఈ పథకానికి అంచనా వ్యయం సుమారు 480 కోట్లగా అధికారులు వెల్లడించారు.ఒక్కో చీర తయారీకి ప్రభుత్వం నిర్ణయించిన యూనిట్ రేట్ సుమారు రూ. 800కి తక్కువగా ఉండగా, ఒక మహిళకు రెండు చీరలు ఇవ్వడం ద్వారా సుమారు రూ. 1,600 విలువను చేరువ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
