
నేడు కొలువుదీరనున్న గ్రామ పాలకులు
ఎన్నికల హడావుడితో గ్రామాలు కొన్ని రోజులుగా ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకున్నాయి. గ్రామాల నాయకులు, అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు నిద్రలేని రాత్రులు గడుపుతూ విశ్వప్రయత్నాలు చేశారు. ఇంటింటి ప్రచారం, సమావేశాలు, హామీల వెల్లువతో గ్రామాలు రాజకీయ చర్చలతో మార్మోగాయి.
మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఓటింగ్ రోజున గ్రామాల్లో ఓటర్ల ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలు ఏర్పడి ప్రజాస్వామ్య పండుగను గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. ఓట్ల లెక్కింపుతో ఉత్కంఠ మరింత పెరిగి, చివరకు ఫలితాలు వెలువడ్డాయి.
పోటీలో ఎంతమంది అభ్యర్థులు ఉన్నప్పటికీ గెలుపు మాత్రం చివరకు ఒక్కరికే దక్కింది. ప్రజల విశ్వాసాన్ని పొందిన వారు విజయం సాధించి గ్రామపాలకులుగా ఎన్నికయ్యారు. నేడు 12,769 సర్పంచులు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసి గ్రామాభివృద్ధి బాధ్యతలను స్వీకరించనున్నారు. గ్రామ ప్రజల ఆకాంక్షలు, సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త పాలకులు ముందుకు సాగనున్నారు.
గ్రామాల్లో ఎన్నికల అనంతరం కొలువుతీరే పాలకులు కక్షసాధింపు ధోరణిని వీడాలని, స్వార్థపూరిత ఆలోచనలకు స్వస్తి చెప్పాలని పలువురు సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ఖర్చును తిరిగి రాబట్టుకోవాలనే ధ్యాసతో అవినీతికి పాల్పడకుండా, పారదర్శకమైన పాలన అందించడమే లక్ష్యంగా సాగాలని వారు సూచిస్తున్నారు.
కొలువుతీరాక కక్షగట్టే ధోరణితో, స్వార్థపూరిత ఆలోచనలతో ఖర్చుపెట్టిన డబ్భును ఎలా రాబట్టుకొవాలోనని, తమకు మద్దతివ్వనివారి పై ఏవిధంగా కక్షపూరిత చర్యలు చేపట్టాలనోగాకూండా ఆదర్శవంతమైన పాలన అందించాలి అవినీతికి పాల్పడకూండా ఐదేళ్ల పాటు నిరంతరం శ్రమిస్తూ, గ్రామాభివృద్దికి గ్రామంలోని పలువురితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి. కక్షలు, కార్పణ్యాలకు తావులేకుండా అభ్యున్నతే ధ్యేయంగా సాగే పాలనే నిజమైన గ్రామ స్వరాజ్యానికి బాటలు వేస్తుంది.
